వరుసగా 5 సెంచరీలతో రికార్డులకే దడ దడ.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌లకే జట్టు నుంచి తప్పించిన చెన్నై..

Dhruv Shorey 5 Consecutive Centuries: విదర్భ బ్యాట్స్‌మన్ ధృవ్ షోరే మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, మరో సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో, హైదరాబాద్‌పై షోరే సెంచరీ సాధించి, తన జట్టును 89 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.

వరుసగా 5 సెంచరీలతో రికార్డులకే దడ దడ.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌లకే జట్టు నుంచి తప్పించిన చెన్నై..
Dhruv Shorey

Updated on: Dec 26, 2025 | 9:20 PM

Dhruv Shorey 5 Consecutive Centuries: భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ ఓపెనర్ ధ్రువ్ షోరే (Dhruv Shorey) సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో షోరే అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే లిస్ట్-ఏ (వన్డే ఫార్మాట్) క్రికెట్‌లో వరుసగా ఐదు సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా ప్రపంచ రికార్డును సమం చేశాడు.

హైదరాబాద్‌పై విరుచుకుపడ్డ షోరే..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టుకు ఓపెనర్లు అమాన్ మొఖాడే (82), యశ్ రాథోడ్ (68) బలమైన పునాది వేశారు. అనంతరం వన్ డౌన్‌లో వచ్చిన ధ్రువ్ షోరే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 77 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 365 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఐదు సెంచరీల ప్రయాణం ఇదీ.. ధ్రువ్ షోరే వరుస సెంచరీల పరంపర గత సీజన్ (2024-25) నుంచి కొనసాగుతోంది.

క్వార్టర్ ఫైనల్: కర్ణాటకపై 118 పరుగులు.

సెమీ ఫైనల్: హర్యానాపై 114 పరుగులు.

ఫైనల్: కర్ణాటకపై 110 పరుగులు (గత సీజన్ ముగింపు).

ఈ సీజన్ మొదటి మ్యాచ్: బెంగాల్‌పై 136 పరుగులు.

ఈ సీజన్ రెండో మ్యాచ్: హైదరాబాద్‌పై 109* పరుగులు.

జగదీశన్ రికార్డు సమం..

గతంలో తమిళనాడు బ్యాటర్ ఎన్. జగదీశన్ 2022-23 సీజన్‌లో వరుసగా 5 సెంచరీలు సాధించి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు ధ్రువ్ షోరే అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. అంతకుముందు కుమార సంగక్కర, దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ వంటి వారు వరుసగా 4 సెంచరీలు సాధించారు. షోరే ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

షోరే మెరుపు సెంచరీతో విదర్భ నిర్దేశించిన 366 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు తడబడింది. విదర్భ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ కేవలం 276 పరుగులకే పరిమితమైంది. దీంతో విదర్భ 89 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ధ్రువ్ షోరే ఫామ్ చూస్తుంటే వచ్చే మ్యాచ్‌లో ఆరో సెంచరీ చేసి కొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తాడేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..