Aman Khan : 9 ఫోర్లు, 10 సిక్సర్లతో ధోనీ శిష్యుడి ఊచకోత..సంబరాలు చేసుకుంటున్న సీఎస్‌కే
Aman Khan : రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త అందింది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సీఎస్‌కే స్టార్ ఆల్ రౌండర్ అమన్ ఖాన్ తన ప్రతాపం చూపిస్తున్నాడు.

Aman Khan : రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త అందింది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సీఎస్‌కే స్టార్ ఆల్ రౌండర్ అమన్ ఖాన్ తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుదుచ్చేరి తరపున ఆడుతున్న ఈ 29 ఏళ్ల ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలుమూలలా సిక్సర్ల మోత మోగిస్తూ విధ్వంసకర శతకాన్ని బాదాడు.
రంజీ ట్రోఫీ 7వ రౌండ్ లో భాగంగా రాజస్థాన్, పుదుచ్చేరి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఒక సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు కేవలం 168 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి జట్టుకు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అమన్ ఖాన్ కొండంత అండగా నిలిచాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ అమన్, కేవలం 76 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 87 బంతులు ఎదుర్కొన్న అతను 118 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఏకంగా 10 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.
ప్రస్తుత రంజీ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా అమన్ ఖాన్ రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ఫామ్ ఐపీఎల్ 2026 కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. ఐపీఎల్ 2026 వేలంలో సీఎస్‌కే ఇతడిని కేవలం రూ.40 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అమన్ ఖాన్, అప్పట్లో పెద్దగా రాణించలేకపోయాడు. కానీ ఈసారి ధోనీ సేనలో చేరాక అతని ఆట తీరు పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, అమన్ ఖాన్ ప్రయాణం ఎప్పుడూ పూలబాటలా సాగలేదు. గత నెలలో విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఒక అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన అమన్ ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. పురుషుల లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఒక బౌలర్ అత్యధిక పరుగులు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఆ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోయేలా ఇప్పుడు రణజీల్లో బ్యాట్‌తో సమాధానం చెప్పడం అతని పట్టుదలకు నిదర్శనం.
బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడన్న విమర్శలు ఉన్నప్పటికీ, బ్యాటింగ్‌లో అమన్ ఖాన్‌కు ఉన్న రా పవర్ అతడిని మ్యాచ్ విన్నర్‌గా మారుస్తోంది. ఫినిషర్‌గా ధోనీకి ఒక మంచి ఆప్షన్ దొరికినట్లేనని సీఎస్‌కే అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పుదుచ్చేరి జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసి భారీ ఆధిక్యం సాధించడంలో అమన్ ఇన్నింగ్స్ కీలకంగా మారింది. రాబోయే ఐపీఎల్ సీజన్లో అమన్ ఖాన్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
