ఐపీఎల్ 2022(IPL 2022)లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌లా మారింది. దీపక్ చాహర్, ఆడమ్ మిల్నే వంటి ఆటగాళ్లను గాయం కారణంగా కోల్పోయిన తర్వాత, తాజాగా మరో ఆల్ రౌండర్‌ని కూడా కోల్పోయింది. చెన్నై మాజీ సారథి రవీంద్ర జడేజా(Ravindra Jadeja) గాయంతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. జడేజా మిగిలిన మ్యాచ్‌లు ఆడడు. IPL 2022 నుంచి బయటికి రావొచ్చని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆడలేదనే విషయం తెలిసిందే. నివేదికల ప్రకారం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. రవీంద్ర జడేజా శరీరం పైభాగానికి గాయమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, రవీంద్ర జడేజా గాయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే అతను త్వరగా కోలుకోలేకపోతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను మిగిలిన మ్యాచ్‌లలో చెన్నై ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాకపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఐపీఎల్ 2022 రవీంద్ర జడేజాకు ఓ పీడకలలా మిగిలింది. ఈ ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్ అయ్యాడు. జడేజా కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. 8 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ తర్వాత, జడేజా సీజన్ మధ్యలో కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అతని స్థానంలో ధోనీ మళ్లీ చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర జడేజా 19.33 సగటుతో 116 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో పాటు ఫీల్డింగ్‌లో క్యాచ్‌లను కూడా మిస్ చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది చెన్నై టీంలో రవీంద్ర జడేజా ఓ ఫ్లాప్ షోగా మిగిలిపోయాడు.