Jasprit Bumrah : బూమ్రానే కావాలా.. ఆయన లేకుండా గెలవలేరా.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బౌలర్

భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. బుమ్రా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలవకపోగా, అతను లేని రెండు మ్యాచ్‌ల్లో మాత్రం గెలిచింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఒక ఆసక్తికరమైన సూచన చేశారు.

Jasprit Bumrah : బూమ్రానే కావాలా.. ఆయన లేకుండా గెలవలేరా.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బౌలర్
Jasprit Bumrah

Updated on: Aug 09, 2025 | 11:05 AM

Jasprit Bumrah : ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలవలేదు. కానీ, భారత్ గెలిచిన రెండు మ్యాచ్‌లలో బుమ్రా జట్టులో లేడు. ఈ రెండు మ్యాచ్‌లలో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బుమ్రా లేకుండా కూడా భారత్ గెలవగలదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ ఒక సంచలన సలహా ఇచ్చారు.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను 2-2తో సమం చేసిన రెండు మ్యాచ్‌లలో బుమ్రాకు వర్క్‌లోడ్ కారణంగా విశ్రాంతి ఇచ్చారు. ఆ మ్యాచ్‌లలో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగంలో ముందుండి నడిపించి, రెండు మ్యాచ్‌లలోనూ 5 వికెట్ల చొప్పున తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ పరిణామంతో బుమ్రా లేనప్పుడు కూడా జట్టు విజయాలు సాధించగలదని, అతనిని తరచూ విశ్రాంతికి పంపే వ్యూహం సరైనదేనా అనే చర్చ మొదలైంది.

భారత సంతతికి చెందిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్, ఈ విషయంపై స్పందిస్తూ ఒక కీలకమైన సలహా ఇచ్చారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ ఇలా అన్నారు.. స్వదేశంలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లలో బుమ్రా లేకుండా కూడా భారత్ ఏ జట్టునైనా ఓడించగలదు. కానీ, విదేశీ పిచ్‌లపై మాత్రం అతను జట్టుకు ఎక్స్-ఫ్యాక్టర్. అందుకే, స్వదేశంలో జరిగే సిరీస్‌ల నుంచి బుమ్రాకు విశ్రాంతినిచ్చి, విదేశీ పర్యటనలలో మాత్రం అతని పూర్తి సేవలను ఉపయోగించుకోవాలి. ఈ వ్యూహం జట్టుకు చాలా లాభం చేకూరుస్తుందని పనేసర్ అభిప్రాయపడ్డారు.

మాంటీ పనేసర్ ఇచ్చిన ఈ సలహా టీమిండియాకు కొత్తదేమీ కాదు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, బుమ్రా తన టెస్ట్ అరంగేట్రం విదేశీ పిచ్‌పైనే చేశారు. తొలి మూడేళ్లు కేవలం విదేశీ పర్యటనలలో మాత్రమే టెస్టులు ఆడి, స్వదేశీ మ్యాచ్‌లకు అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ త్వరలో వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాలతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లలో బుమ్రా ఉంటాడా లేదా అనేది జట్టు యాజమాన్యం వ్యూహాన్ని తెలియజేస్తుంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.