IND A vs BAN A : బెడిసి కొట్టిన కెప్టెన్ వ్యూహాలు..గెలిచే మ్యాచ్‌లో మూడు ఘోర తప్పిదాలతో ఓడిపోయిన టీమిండియా
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో ఇండియా ఏ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. తొలి సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏ విజయం అంచున వరకు వెళ్లి కూడా ఓటమిని అంగీకరించక తప్పలేదు. మొదట 20 ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠగా సాగి సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే సూపర్ ఓవర్‌లో భారత జట్టు ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది.

IND A vs BAN A : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో ఇండియా ఏ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. తొలి సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏ విజయం అంచున వరకు వెళ్లి కూడా ఓటమిని అంగీకరించక తప్పలేదు. మొదట 20 ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠగా సాగి సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే సూపర్ ఓవర్‌లో భారత జట్టు ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. ఈ ఓటమికి జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న మూడు పెద్ద నిర్ణయాలే కారణమని విశ్లేషకులు అంటున్నారు. వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య వంటి మెరుపు బ్యాటర్లు ఉన్నా, సరైన వ్యూహం లేకపోవడం జట్టుకు భారీ నష్టాన్ని కలిగించింది.
టాస్ గెలిచి తప్పు చేశారు
కెప్టెన్ జితేష్ శర్మ తీసుకున్న తొలి తప్పు నిర్ణయం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం. సాధారణంగా నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఏ జట్టు అయినా ముందుగా బ్యాటింగ్ చేసి, బోర్డుపై పెద్ద స్కోరు ఉంచాలని భావిస్తుంది. కానీ, జితేష్ దీనికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఏ జట్టు మొదట్లోనే వేగంగా రన్స్ చేయడం మొదలుపెట్టింది. దీంతో భారత్ ఏ పై ఒత్తిడి పెరిగింది. ఒకవేళ భారత్ ముందు బ్యాటింగ్ చేసి ఉంటే, మ్యాచ్ ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది.
పార్ట్-టైమ్ బౌలర్‌తో భారీ మూల్యం
మ్యాచ్ గమనాన్ని మార్చిన అసలు సంఘటన చివరి రెండు ఓవర్లలో జరిగింది. 19వ ఓవర్‌ను పార్ట్-టైమ్ బౌలర్ నమన్ ధీర్ కు అప్పగించడం పెద్ద పొరపాటుగా నిలిచింది. నమన్ ధీర్ ఈ ఓవర్‌లో ఏకంగా 28 పరుగులు సమర్పించుకున్నాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ ఎస్‌ఎం మెహరోబ్ ఈ ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి, భారత్ ఏ ప్లాన్‌ను పూర్తిగా చెడగొట్టాడు. దీని తర్వాత 20వ ఓవర్‌లో కూడా 22 రన్స్ రావడంతో, కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు వచ్చాయి. అంతకుముందు భారత బౌలర్లు మ్యాచ్‌ను బాగా అదుపులోకి తీసుకువచ్చినా, ఈ రెండు ఓవర్లు ఆట మొత్తాన్ని తిప్పేశాయి.
సూపర్ ఓవర్‌లో స్టార్ బ్యాటర్లను పక్కన పెట్టడం
మ్యాచ్ టై కావడానికి ముఖ్యంగా కారణమైన ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య. సూర్యవంశీ కేవలం 15 బంతుల్లో 38 పరుగులు చేశాడు, ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను టై చేయగలిగారు. అయినప్పటికీ సూపర్ ఓవర్‌లో వీరిద్దరినీ బ్యాటింగ్‌కు పంపకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన నిర్ణయం.
కెప్టెన్ జితేష్ శర్మ స్వయంగా బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అశుతోష్ కూడా ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. దీంతో ఇండియా ఏ జట్టు సూపర్ ఓవర్‌లో 0/2 తో పతనం అయింది. బంగ్లాదేశ్ కూడా తొలి బంతికే వికెట్ కోల్పోయినా, భారత బౌలర్ సుయాష్ శర్మ ఒత్తిడిలో వైడ్ బాల్ విసిరాడు. దీంతో బంగ్లాదేశ్ ఏ పరుగు చేయకుండానే మ్యాచ్ గెలిచి ఫైనల్ టికెట్‌ను దక్కించుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
