Team India: ప్రపంచకప్ ఎఫెక్ట్.. టీ20లకు నయా కెప్టెన్ హార్దిక్, రోహిత్‌కు చెక్.. అఫీషియల్ ప్రకటన అప్పుడే?
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా ఘోర వైఫల్యం అనంతరం బీసీసీఐకి కనువిప్పు కలిగింది. ఒక్కొక్కటిగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ..
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా ఘోర వైఫల్యం అనంతరం బీసీసీఐకి కనువిప్పు కలిగింది. ఒక్కొక్కటిగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ.. జట్టును ప్రక్షాళన చేస్తోంది. ఇప్పటికే జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బోర్డు.. త్వరలోనే మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పలు విదేశీ జట్లు పాటిస్తున్న Split కెప్టెన్సీ(వేర్వేరు కెప్టెన్‌ల)ని టీమిండియాలోకి ఆచరణకు తీసుకురావాలని చూస్తున్నట్లు బీసీసీఐ కీలక అధికారి స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఇన్‌సైడ్ స్పోర్ట్(Inside Sport)కు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు చేపడుతోన్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడి సారధ్యంలోనే భారత్ జట్టు ఘోర ఓటమిపాలైంది. టీ20 ఫార్మాట్‌లో ఆశించినస్థాయిలో ఫలితాలు రాకపోవడం, అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా రోహిత్ శర్మ విఫలం కావడంతో.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంచుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇకపై టీ20లకు హార్దిక్ పాండ్యా సారధ్యం వహించనుండగా.. టెస్టులు, వన్డేలకు మాత్రం రోహిత్ శర్మను కెప్టెన్‌గా పరిమితం చేయాలని యోచిస్తోందట. కొత్త సెలెక్షన్ ప్యానెల్ వచ్చిన తర్వాత ఓసారి చర్చించి.. దీనిపై అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా హార్దిక్ సారధ్యంలోనే టీమిండియా.. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడిన అనంతరం.. కెప్టెన్సీ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే.. అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఈ మార్పులు ఏంటని కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ మినహాయిస్తే.. రోహిత్ శర్మ ఆటతీరులో ఎలాంటి మార్పు లేదని.. కెప్టెన్‌గా రోహిత్‌కు మరికొంత కాలం ఛాన్స్ ఇవ్వొచ్చునని బీసీసీఐని కోరుతున్నారు. ఇంకొందరైతే.. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో మార్పులు, కెప్టెన్‌ను మార్చాలని అంటున్నారు. హార్దిక్ పాండ్యాకు టీ20 పగ్గాలు ఇవ్వడం కరెక్టేనని అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి షాకింగ్ నిర్ణయాలు బీసీసీఐ తీసుకోబోతోందో మరి చూడాలి.