Cricket Controversy : బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు..మధ్యలో ఐసీసీకి తలపోటు
Cricket Controversy : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2026 టీ20 వరల్డ్ కప్ వేదికల విషయంలో మొదలైన వివాదం కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదంటూ బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

Cricket Controversy :బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలి మధ్య వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. మంగళవారం సచివాలయంలో మీడియా ముందు మాట్లాడిన బంగ్లా క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, భారత బోర్డుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీసీఐ మాట విని ఐసీసీ తమపై అన్యాయమైన నిబంధనలు విధిస్తే వాటిని ఏమాత్రం అంగీకరించబోమని తెగేసి చెప్పారు. గతంలో భారత్ పాకిస్తాన్ వెళ్ళడానికి నిరాకరించినప్పుడు వేదికలు ఎలా మార్చారో, ఇప్పుడు తమ విషయంలో కూడా అలాగే చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి, ఐసీసీ ఇప్పటికే బంగ్లాదేశ్ బోర్డుకు ఒక అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. జనవరి 21లోగా బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ఆడటంపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ భద్రతా కారణాలు లేదా మరే ఇతర సాకులతో ఇండియాకు రాము అని బంగ్లాదేశ్ చెబితే, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ జట్టుకు కేటాయించి, టోర్నీని యథావిధిగా నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. దీనిపై బంగ్లా మీడియా కమిటీ చైర్మన్ అమ్జద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఐసీసీ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని తెలిపారు.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్ గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్‌లతో కలిసి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ వేదికల మార్పు విషయంలో బంగ్లా పట్టుబడుతుండటం ఐసీసీకి పెద్ద సవాల్‌గా మారింది. షెడ్యూల్ మార్చడానికి ఐసీసీ సిద్ధంగా లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటుందా లేక మెట్టు దిగి భారత్‌కు వస్తుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. క్రికెట్ మైదానంలో జరగాల్సిన పోరాటం కాస్తా, ఇప్పుడు బోర్డుల మధ్య యుద్ధంలా మారిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
