AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 పరుగులకే 7 వికెట్లు ఏంది భయ్యా.. క్రికెట్ చరిత్రలో మరో చెత్త రికార్డ్ నమోదు.. ఎక్కడంటే?

SL vs BAN, 1st ODI: బుధవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా ఓ చెత్త రికార్డ్ నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టు చాలా అవమానకరమైన రికార్డును సృష్టించింది.

5 పరుగులకే 7 వికెట్లు ఏంది భయ్యా.. క్రికెట్ చరిత్రలో మరో చెత్త రికార్డ్ నమోదు.. ఎక్కడంటే?
Sl Vs Ban
Venkata Chari
|

Updated on: Jul 03, 2025 | 11:42 AM

Share

SL vs BAN, 1st ODI: శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను కోల్పోయి, 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ అనూహ్య పతనం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక, చరిత్ అసలంక (106) సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు, తంజిమ్ హసన్ సకిబ్ 3 వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేశారు.

245 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఒక దశలో 100 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో కనిపించింది. తంజిద్ హసన్ (62), జాకిర్ అలీ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. అయితే, నజ్ముల్ హుస్సేన్ షాంటో రనౌట్ కావడంతో బంగ్లా పతనం మొదలైంది.

ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడలేకపోయారు. వనిందు హసరంగా (4/10), కమిందు మెండిస్ (3/19) మాయాజాలం సృష్టించారు. 100/1 నుంచి 105/8కి చేరుకోవడానికి బంగ్లాదేశ్‌కు కేవలం 5 పరుగులు, 27 బంతులు మాత్రమే పట్టాయి. లిట్టన్ దాస్, కెప్టెన్ మెహిది హసన్, తస్కిన్ అహ్మద్ డకౌట్ అయ్యారు. చివరకు బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయింది.

చరిత్రలో చెత్త పతనం..

ఈ 7 వికెట్ల పతనం బంగ్లాదేశ్ వన్డే చరిత్రలో రెండో చెత్త రికార్డుగా నమోదైంది. గతంలో 2014లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లను 8 పరుగులకే కోల్పోయింది. అలాగే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లను 11 పరుగులకే కోల్పోయింది.

ఈ ఓటమి బంగ్లాదేశ్ జట్టుకు ఒక గుణపాఠం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిని తట్టుకోలేకపోయారని కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ అంగీకరించారు. రాబోయే మ్యాచ్‌లలో పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. తదుపరి మ్యాచ్ శనివారం ఇదే వేదికలో జరగనుంది.

ప్రపంచంలో ఏకైక జట్టుగా..

2008లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జింబాబ్వే తక్కువ పరుగులకే 7 వికెట్లు కోల్పోయి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆసక్తికరంగా, వన్డే చరిత్రలో అత్యంత దారుణమైన ఏడు వికెట్ల పతనానికి దారితీసిన మూడు సందర్భాలు 1996 ప్రపంచ ఛాంపియన్ శ్రీలంకపైనే జరిగాయి. ఏడు పరుగులు లేదా అంతకంటే తక్కువ తేడాతో మూడుసార్లు ఈ ఘనతను సాధించిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..