Telugu News Sports News Cricket news BAN vs SL: Srilanka cricketers Celebrates Win Over Bangladesh With Nagin Dance in Asia cup 2022, watch viral video
BAN vs SL, Asia Cup 2022:కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత లంక ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. శ్రీలంక ఆటగాడు చమిక కరుణరత్నెతో ఇతర ఆటగాళ్లు, అభిమానులు నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టారు. స్టేడియాన్ని హోరెత్తించారు.
BAN vs SL, Asia Cup 2022: సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. నిదహాస్ ట్రోఫీ సెమీఫైనల్..అప్పుడు అంతో ఇంతో పటిష్టంగా ఉన్న శ్రీలంకని బంగ్లాదేశ్ జట్టు రెండు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. సంతోషం పట్టలేకపోయిన బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ మైదానంలో నాగిని డ్యాన్స్‌తో సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతర ఆటగాళ్లు కూడా అతనితో చేరి రచ్చ రచ్చ చేశారు. అసలే ఓడిపోయిన బాధలో ఉన్న లంకేయులకు బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్ మరింత కోపం తెప్పించింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలాయి. సీన్ కట్ చేస్తే.. నాలుగేళ్ల తర్వాత ఆసియా కప్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై శ్రీలంక క్రికెట్ జట్టు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో లంకేయులు రెండు వికెట్ల తేడాతో బంగ్లా పులులుపై గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు ఈ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో బంగ్లా ఇంటి బాట పట్టగా.. లంక సూపర్-4 రౌండ్‌లోకి ప్రవేశించింది.
కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత లంక ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. శ్రీలంక ఆటగాడు చమిక కరుణరత్నెతో ఇతర ఆటగాళ్లు, అభిమానులు నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టారు. స్టేడియాన్ని హోరెత్తించారు. తద్వారా నాలుగేళ్ల క్రితం నిదహాస్ ట్రోఫీలో ఇదే బంగ్లా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 183/7 స్కోరు సాధించింది. ఆతర్వాత లంక 19.2 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 184 పరుగులు చేసి విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో లంక విజయానికి చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అప్పటికే శనక (45), మెండిస్ (60) పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే చమిక కరుణరత్నె ( 10 బంతుల్లో 16 నాటౌట్) దూకుడుగా ఆడాడు. అయితే దురదృష్టవశాత్తు19వ ఓవర్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు . ఈ ఓవర్‌లో లంక ఆటగాళ్లు 17 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతుల్లోనే ఐదు పరుగులు రాబట్టింది. అయితే తర్వాతి బంతిని బంగ్లా బౌలర్ మహెది హసన్ నోబాల్‌గా వేశాడు. దీనికి మరో రెండు పరుగులు వచ్చాయి. దీంతో లంక విజయం ఖరారైంది.