AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babar Azam: బాబర్‌ ఆజమ్‌ కావాలనే పాకిస్థాన్‌ను ఓడించాడా? ఇందులో నిజమెంత? నిన్న మ్యాచ్‌లో అసలేం జరిగింది?

క్రికెట్‌లోకం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రారంభం అయిపోయింది. నిన్న కరాచీ వేదికగా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూవైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. అయితే పాక్ ఓటమితో బాబర్ ఆజమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది.

Babar Azam: బాబర్‌ ఆజమ్‌ కావాలనే పాకిస్థాన్‌ను ఓడించాడా? ఇందులో నిజమెంత? నిన్న మ్యాచ్‌లో అసలేం జరిగింది?
Babar Azam
SN Pasha
|

Updated on: Feb 20, 2025 | 6:36 AM

Share

కొన్ని రోజుల ముందే పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ట్రై సిరీస్‌లో పాక్‌ను ఫైనల్లో ఓడించి సిరీస్‌ గెలిచిన కివీస్‌.. ఇదే టెంపోను కొనసాగించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్‌ చేసి, ఆ తర్వాత పాక్‌ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు న్యూజిలాండ్‌ బౌలర్లు. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. అతని స్లో బ్యాటింగ్‌ కారణంగానే పాకిస్థాన్‌ ఓటమి పాలైందని, 321 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఇంత దారుణంగానా బ్యాటింగ్‌ చేసింది? ఇది టెస్ట్‌ బ్యాటింగ్‌, వన్డే బ్యాటింగ్‌ కాదు అంటూ చాలా మంది క్రికెట్‌ అభిమానులు విమర్శిస్తున్నారు.

321 పరుగుల టార్గెట్‌తో ఓపెనర్‌గా దిగిన బాబర్‌ 90 బంతుల్లో 64 పరుగులు చేసిన అవుట్‌ అయ్యాడు. రూల్స్‌ ప్రకారం ఫఖర్‌ జమాన్‌ ఆలస్యంగా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో బాబర్‌తో కలిసి ఓపెనర్‌గా సౌద్‌ షకీల్‌ వచ్చాడు. అతను 19 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. నిజానికి పాక్‌ ఓపెనర్లు చాలా స్లోగానే స్టార్ట్‌ చేశారు. షకీల్‌ అవుట్‌ తర్వాత ఫిలిప్స్‌ సూపర్‌ మ్యాన్‌ క్యాచ్‌తో కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ కూడా అవుట్‌ కావడంతో పాక్‌ 22 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో బాబర్‌ వికెట్లు కాపాడేందుకు స్లోగా ఆడుతున్నాడేమో అనిపించింది కానీ, బాబర్‌ మరీ స్లోగా ఆడాడు అనేది వాస్తవం.

అతని టెస్ట్‌ బ్యాటింగ్‌ వల్ల మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్లు రన్‌రేట్‌ కోసం కాస్త వేగం ఆడే ప్రయత్నంలో భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్‌ అయ్యారు. షఖర్‌ జమాన్‌, అఘా సల్మాన్‌ ఇద్దరూ అలాగే తమ వికెట్లు సమర్పించుకున్నారు. సల్మాన్‌ బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత ఒక్కసారిగా పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ లో జోష్‌ వచ్చింది. ఫోర్లతో న్యూజిలాండ్‌ బౌలర్లపై సల్మాన్‌ విరుచుకుపడ్డాడు. కానీ, మరో ఎండ్‌లో బాబర్ అదే జిడ్డూ ఇన్నింగ్స్‌ ఆడాడు. సల్మాన్‌ 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి అంత వేగంగా ఆడే క్రమంలో అవుట్‌ అయ్యాడు. బాబర్‌ మాత్రం తన హాఫ్‌ సెంచరీ కోసమే ఆడుతున్నట్లు కనిపించింది. ఎంత యాంకర్‌ రోల్‌ ప్లే చేసినా.. 20 ఓవర్లకు పైగా క్రీజ్‌లో ఉండి, రిక్వైర్డ్‌ రన్‌ రేట్‌ పెరిగిపోతున్నా కూడా అంతే స్లోగా ఆడటంపై విమర్శలు వస్తున్నాయి.

అయితే న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ సమయంలో పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించింది. పిచ్‌పై టర్న్‌, స్వింగ్‌, బౌన్స్‌ ఏది కనిపించలేదు. కానీ, పాక్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో పిచ్‌పై స్పిన్నర్లకు మంచి టర్న్‌ లభించింది. నిజానికి సెకండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో గ్రౌండ్‌లో డ్యూ వస్తుంది, బ్యాటింగ్‌కు ఈజీ అవుతుందని భావించి పాక్‌ కెప్టెన్‌ రిజ్వాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కానీ, అతని అంచనా నిజం కాలేదు. దానికి తోడు పాక్‌ టాపార్డర్‌ స్లో బ్యాటింగ్‌ కూడా తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది.

తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో జరిగిన పలు విషయాలతో ఆగ్రహంగా ఉన్న బాబర్‌ ఆజమ్‌ ఇప్పుడు తాను స్కోర్‌ చేస్తే చాలు, జట్టు గెలుపోటములతో తనకు సంబంధం లేదని భావిస్తూ ఇలా ఆడుతున్నాడు, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కావాలనే పాక్‌ను ఓడించాడనే తీవ్ర విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాటిలో వాస్తవం లేనప్పటికీ.. ఛాంపియన్స్‌ ట్రోఫీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న పాకిస్థాన్‌, తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలుకావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ నెల 23న ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడిపోతే.. అధికారికంగా ఆ జట్టు ఇంటిబాట పడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.