Javed Miandar Legacy: జావెద్‌ మియాందాద్ సిక్సర్‌కు 35 ఏళ్లు..!

Javed Miandar Legacy:  జావెద్‌ మియాందాద్ సిక్సర్‌కు 35 ఏళ్లు..!

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ పోరులో ఉండే కిక్కే వేరు! ఆరంభంలో అంటే ఎనిమిదో దశకంలో అలా ఉండేది కాదు కానీ రాన్రాను అదో బాటిల్‌ఫీల్డ్‌లా తయారయ్యింది.

Balu

| Edited By: Ravi Kiran

Apr 18, 2021 | 6:24 PM

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ పోరులో ఉండే కిక్కే వేరు! ఆరంభంలో అంటే ఎనిమిదో దశకంలో అలా ఉండేది కాదు కానీ రాన్రాను అదో బాటిల్‌ఫీల్డ్‌లా తయారయ్యింది. దాదాపు నూటయాభై కోట్ల ఉపఖండ ప్రజలకు అదో గుండెచప్పుడుగా మారింది. భావోద్రేకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఆ ఉత్కంఠతే! స్టేడియంలో అరుపులు, కేరింతలు, కేకలు, మధ్యమధ్యన ఉస్‌స్‌స్‌మన్న నిట్టూర్పులు, పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌లు. సరిగ్గా 35 ఏళ్ల కిందట షార్జాలో ఇలాంటి ఉత్కంఠతనే, ఇలాంటి ఉద్విగ్నతనే ప్రేక్షకులు అనుభవించారు. ఇంటిపట్టునే ఉన్న అభిమానులు సైతం అఖరినిమిషం వరకు టీవీలకు అతుక్కుపోయారు.

అది ఏప్రిల్‌ 18, 1986. షార్జాలో ఆస్ర్టలేషియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌! అది కూడా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య. టైటిల్‌ విజేతను నిర్ణయించే కీలక మ్యాచ్‌! షార్జాలో అంతకు ముందు వరకు పాక్‌పై భారత్‌దే పై చేయి. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ మ్యాచ్‌లో మాత్రం పాకిస్తాన్‌ గెలిచింది. అందుకే ఆస్ట్రలేషియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ పట్ల ఉపఖండ ప్రజలలో ఆసక్తి పెరిగింది. పొట్ట చేత పట్టుకుని అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లిన ఇండియా-పాక్‌ దేశస్తులు వారం రోజుల ముందే టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఇండియా-పాక్‌ మధ్యే తుది సమరం జరుగుతున్న నమ్మకం వారిది!

01

ఆరోజు శ్రీరామనవమి. భారత్‌లో పండుగ వాతావరణం.. ఇక తెలుగువారైతే ఓ పక్క భద్రాచలంలో జరుగుతున్న సీతారాములకళ్యాణాన్నిరేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వింటూ పండుగ భోజనాన్ని కానిచ్చేసి టీవీల ముందుకు చేరుకున్నారు. అప్పటికే ఇండియా ఇన్నింగ్స్‌ చివరి దశకు వచ్చింది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ ముందు భారత్‌ను బ్యాటింగ్‌ చేయమంది.. అప్పట్లో అదే పద్దతి. ఓపెనర్లు శ్రీకాంత్‌, గవాస్కర్‌లు మొదటి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. శ్రీకాంత్‌ 80 బంతుల్లో ఎనిమిది బౌండరీలు, రెండు సిక్సర్లతో 75 పరుగులు చేసి అబ్దుల్‌ ఖాదిర్‌ బౌలింగ్‌లో అక్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన వెంగ్‌సర్కార్‌ సరిగ్గా హాఫ్‌ సెంచరీ చేసి అక్రమ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. కీర్తిఆజాద్‌ సున్నాకే అవుటవ్వగా, కపిల్‌దేవ్‌ 8 పరుగులు, చేతన్‌శర్మ పది పరుగులు, రవిశాస్త్రి ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. రవిశాస్త్రి కంటే ముందు గవాస్కర్‌ అవుటయ్యాడు. 134 బాల్స్‌ ఆడిన గవాస్కర్‌ ఆరు బౌండరీలతో 92 పరుగులు చేశాడు. మొత్తం మీద ఇండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.. ఆ రోజుల్లో ఇది పెద్ద టోటలే! అక్రమ్‌ మూడు వికెట్లు, ఇమ్రాన్‌ఖాన్‌ రెండు వికెట్లు తీసుకున్నారు.

02

తర్వాత బరిలో దిగిన పాక్‌ను ఆరంభంలోనే చేతన్‌శర్మ దెబ్బతీశాడు. ముదస్సర్‌ నజర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికీ పాక్‌ స్కోరు తొమ్మిది పరుగులే. తర్వాత వచ్చిన రమీజ్‌రజాను మణీందర్‌సింగ్‌ ఇంటిదారి పట్టించాడు. మరో ఓపెనర్‌ మోహ్‌సిన్‌ఖాన్‌ 36 పరుగులు చేసి మదన్‌లాల్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. 21 పరుగులు చేసిన సలీమ్‌మాలిక్‌ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. అప్పటికి పాక్‌ స్కోరు నాలుగు వికెట్లకు 110 పరుగులు. పాక్‌ గెలుపు కోసం ఇంకా 136 పరుగులు కావాలి. నిర్దేశిత రన్‌రేట్‌ కాస్తా 6.28కు చేరుకుంది. ఆ రోజుల్లో ఈ టార్గెట్‌ను చేరుకోవడం దాదాపు అసాధ్యమే! ఏదో ఒక మిరాకిల్‌ జరిగితే తప్ప… ఈ సమయంలో అబ్దుల్‌ ఖాదిర్‌ను ఆరో నంబర్‌లో ప్రమోట్‌ చేశాడు ఇమ్రాన్‌ఖాన్‌. ఇమ్రాన్‌ వ్యూహం పనిచేసింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్ల ద్వయం రవిశాస్త్రి, మనీందర్‌సింగ్‌ల బౌలింగ్‌లో పరుగులను కొల్లగొట్టాడు. కేవలం 39 బంతుల్లో ఓ బౌండరీ, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన ఖాదీర్‌ రన్‌రేట్‌ను అమాంతం పెంచాడు. ఖాదీర్‌ను కపిల్‌దేవ్‌ అవుట్‌ చేశాక మళ్లీ పాక్‌పై ఒత్తిడి పెరిగింది. అందుకు కారణం.. హార్డ్‌ హిట్టర్లు అయిన ఇమ్రాన్‌ఖాన్‌ (7), మంజూర్‌ ఇలాహీ (4)లు స్వల్ప స్కోర్లకే వెనుదిరగడం. ఆస్కింగ్‌ రన్‌రేట్‌ అమాంతం పదికి పెరిగింది.. ఆఖరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేస్తే తప్ప పాక్‌ గెలవదు.. ఆ తర్వాత వచ్చిన వసీం అక్రమ్‌ కూడా మూడు పరుగులే చేసి అనవసరంగా రనౌట్‌ అయ్యాడు. పాక్‌ పని అయిపోయిందనుకున్నారంతా! పాక్‌ అభిమానులు చాలా మంది నిట్టూరుస్తూ స్టేడియం వదిలి వెళ్లిపోయారు కూడా!

03

అయితే జావెద్‌ మియాందాద్‌ ఇంకా క్రీస్‌లోనే ఉన్నాడన్నా సంగతిని చాలా మంది పట్టించుకోలేదు. మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా సామర్థ్యం జావెద్‌లో అపారం..సింగిల్స్‌ డబుల్స్‌ తీస్తూ, లూస్‌ బాల్స్‌ను బౌండరీలకు తరలిస్తూ స్కోరును లక్ష్యం వైపు తీసుకెళుతున్నాడు జావెద్‌. . కాకపోతే అతడికి సహకారాన్ని అందించేవారే కరువయ్యారు. మదన్‌లాల్ వేసిన 48వ ఓవర్‌లో 13 పరుగులు లభించాయి. ఇందులో ఓ భారీ సిక్సర్‌ కూడా ఉంది. 49వ ఓవర్‌లో పది పరుగులు వచ్చాయి. అక్రమ్‌ చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. పాక్‌ గెలుపు కోసం పది పరుగులు కావాలి.. అంటే అయిదు బంతుల్లో పది పరుగులన్నమాట! రెండో బంతిని మియాందాద్‌ మిడ్‌వికెట్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. నాలుగు బంతులు.. ఆరు పరుగులు.. మూడో బంతిని కూడా బౌండరీకి తరలిద్దామనుకున్నాడు జావెద్‌.. కానీ రోజన్‌ బిన్ని అద్భుతమైన ఫీల్డింగ్‌ కారణంగా కేవలం ఒకే పరుగు వచ్చింది.. వికెట్ కీపర్‌ జుల్కర్‌నైన్‌ స్ట్రయికింగ్‌… మూడు బంతులు .. అయిదు పరుగులు… అద్భుతమైన బంతితో జుల్కర్‌నైన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు చేతన్‌శర్మ. భారత్‌ శిబిరంలో ఉత్సాహం… పాక్‌లో నిరాశ. రెండు బంతుల్లో పాక్‌ గెలవడానికి అయదు పరుగులు కావాలి.. క్రీజ్‌లోకి వచ్చిన తౌసీఫ్‌ అహ్మద్‌ పెద్ద పోటుగాడేం కాదు. రెండు జట్లలోనూ నెర్వస్‌.. తౌసిఫ్‌ అతి కష్టం మీద ఓ పరుగు చేశాడు.. చేశాడనడం కంటే ఉరుకుల పరుగుల మీద రన్‌ తీశారని చెప్పొచ్చు.. పాకిస్తాన్‌ అదృష్టం కొద్దీ రనౌట్‌ ఛాన్స్‌ మిస్సయింది. అజరుద్దీన్‌ కనుక బంతిని నేరుగా వికెట్ల మీదకు విసిరేసి ఉంటే తౌసిఫ్‌ అవుటయ్యేవాడు. ఆ నిమిషాన అదృష్టం తౌసిఫ్‌ వైపు ఉందంతే!

జావెద్ మియందాద్ స్ట్రయికింగ్ ఎండ్‌లోకి వచ్చాడు. భారత బౌలర్ చేతన్ శర్మ బౌలింగ్..మ్యాచ్‌లో అదే చివరి బంతి. గెలుపు కోసం పాక్‌ ఇంకా నాలుగు పరుగులు చేయాలి. దాదాపు మ్యాచ్ భారత్ ఖాతాలోకి చేరినట్టే కనిపించింది. కానీ క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. కొరుక్కోవడానికి గోళ్లు కూడా మిగల్లేదు.. స్టేడియం అంతటా నిశ్శబ్దం.. ఉత్కంఠ.. ఏం జరగబోతుందా అన్న ఆసక్తి.. అప్పటి వరకు పాకిస్తాన్‌ ఒక్క మేజర్‌ టోర్నమెంట్‌ కూడా గెలవలేదు.. కానీ భారత్‌ ఆల్‌రెడీ ప్రపంచకప్‌ను గెల్చుకుంది. 1984లో జరిగిన షార్జా కప్‌ను గెల్చుకుంది. 1985లో ఆస్ట్రేలియాలో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ విజయం సాధించింది.. పైగా ఫైనల్లో పాక్‌నే ఓడించింది. ఆ వెంటనే జరిగిన రోథ్మన్స్‌ కప్‌ను దక్కించుకుంది.. ఇవన్నీ చూస్తే ఆ క్షణాన భారత్‌కే విజయావకాశాలున్నాయని ఎవరైనా అనుకుంటారు.. ఇంతకు ముందు చెప్పినట్టు క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చు. కేవలం ఒకే ఒక్క బంతి ఇరు జట్ల గెలుపోటములను తారుమారు చేయవచ్చు.

చిట్టచివరి బంతి… చేతన్‌ శర్మ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు.. జావెద్‌ తన పార్టనర్‌ తౌసిఫ్‌ దగ్గరకు వచ్చి ఏదో చెప్పి మళ్లీ క్రీస్‌ దగ్గరకు వచ్చాడు. తలతోనే ఫీల్డర్లందరిని లెక్కేసుకున్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ నిలుచున్నారో.. ఎక్కడ గ్యాప్‌లున్నాయో గమనించాడు. అపారమైన అనుభవం కలిగిన జావెద్‌కు చేతన్‌శర్మ ఎలాంటి బంతిని విసురుతాడో తెలియదని అనుకోలేం.. కచ్చితంగా తన కాళ్లమీదకు యార్కర్‌ వేయడానికి ప్రయత్నిస్తాడని జావెద్ ఊహించాడు.. అందుకే కాసింత ముందుకొచ్చి నిలుచున్నాడు.. పాక్‌ గెలుపుకు కావాల్సింది నాలుగు పరుగులు… జావెద్‌ అనుకున్నట్టుగానే చేతన్‌శర్మ యార్కర్‌ వేయడానికి ప్రయత్నించాడు. సరైన ఎత్తులో.. ఫుల్‌టాస్‌లో వస్తున్న ఆ బంతి కోసమే ఎదురుచూస్తున్న జావెద్‌ దాన్ని మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌కు తరలించాడు.. ఓ అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమయ్యింది.. పాకిస్తాన్‌ అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చారు.. ఆ ఒకే ఒక్క సిక్సర్‌ భారత జట్టుపై తీవ్రమైన ప్రభావం చూపింది.. సైకాలాజికల్‌గా బాగా దెబ్బతీసింది. కోలుకోవడానికి పదేళ్లు పట్టింది.. ‘మేం గెలిచాం.. పాకిస్తాన్‌ గెలిచింది. తౌసీఫ్‌ గెలిచాడు..నేను గెలిచాను.. అద్భుతమైన మ్యాచ్‌ అది’… అంటూ జావెద్‌ తన ఆత్మకథలో రాసుకున్నాడు.

ఈ మ్యాచ్‌ అయిన తర్వాత చేతన్‌శర్మను ఎవరూ ఒక్క మాట కూడ అనలేదు.. పైగా క్రికెట్‌లో ఇలాంటివి సహజమేనంటూ సముదాయించారు.. దాదాపు ఏడాది తర్వాత జరిగిన రిలయన్స్‌ వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్‌ సాధించి తనేంటో రుజువు చేసుకున్నాడు చేతన్‌శర్మ… తాను ఆ పీడకలను మర్చిపోవడానికి ఎంతగా ప్రయత్నించినా జనం పదే పదే గుర్తు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని చేతన్‌ వాపోయాడు. ‘జనం నేను తీసిన హ్యాట్రిక్‌ను గుర్తుపెట్టుకోలేదు, నేను ఇంగ్లాండ్‌తో కనబర్చిన ప్రతిభను గుర్తు పెట్టుకోలేదు. కానీ తన బౌలింగ్‌లో జావెద్ కొట్టిన సిక్సర్‌ను మాత్రం మర్చిపోవడం లేదు’ అని బాధపడ్డాడు. ‘ఆ మ్యాచ్‌ అప్పుడు నాకు 18 ఏళ్లు. అవతలి పక్కన ఉన్నదేమో అపారమైన అనుభవం కలిగిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌. కపిల్‌ ఎంతో నమ్మకంతో నా చేతికి బంతిని అందించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఎవరూ నన్ను ఏమీ అనలేదు. కాకపోతే నేనే చాలా అప్‌సెట్‌ అయ్యాను’ అని చేతన్‌ తర్వాతి కాలంలో చెప్పుకొచ్చాడు..

మరిన్ని ఇక్కడ చూడండి: KTR Strategy: తెలంగాణలో మినీ మునిసిపోల్స్… కేటీఆర్ సరికొత్త వ్యూహంతో రెడీ

Corona Vaccine: వ్యాక్సినేష‌న్ చేయించుకున్నా మ‌ళ్లీ పాజిటివ్‌గా తేలిందా..? అయినా ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu