
India vs South Africa, 43rd Match, Super 8 Group 1, ICC Men’s T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ దశలో అజేయంగా సూపర్–8కు చేరుకున్న టీమిండియా, ఇప్పుడు తొలి సూపర్–8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ కీలక మ్యాచ్ ఫిబ్రవరి 22 (ఆదివారం) అహ్మదాబాద్‌లో జరగనుంది. యూఎస్ఏ, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత్, ప్రోటీస్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని ఆశిస్తోంది.
అయితే ,ఈ కీలక మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ ఫామ్ టీమిండియాకు పెద్ద టెన్షన్‌గా మారింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ప్రపంచ నంబర్–1 టీ20ఐ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన అభిషేక్, ఇప్పటివరకు ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా ప్రభావం చూపలేకపోయాడు.
ఈ టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ మూడు మ్యాచ్‌లు ఆడినా ఇంకా ఖాతా తెరవలేదు. యూఎస్ఏపై డక్‌గా ఔటైన అతడు, కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌పై రీఎంట్రీలోనూ ఖాతా తెరవలేకపోయాడు. నెదర్లాండ్స్‌పై కూడా మరోసారి డక్‌గా వెనుదిరిగాడు. వరుసగా మూడు డక్స్ రావడంతో అభిషేక్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇప్పటివరకు అతడి వైఫల్యాలు భారత్ ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, టీమ్ మేనేజ్‌మెంట్ అతడు త్వరగా ఫామ్‌లోకి రావాలని కోరుకుంటోంది.
ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని అభిషేక్ శర్మను జట్టులోంచి తప్పించి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే, అభిషేక్‌ను బెంచ్‌కు పరిమితం చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రీ–మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత అసిస్టెంట్ కోచ్ మోర్నే మోర్కెల్, అభిషేక్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశాడు. నెట్స్‌లో అతడు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.
“అభిషేక్ శర్మపై గ్రూప్‌లో ఎలాంటి చర్చలేదు. అతడు జట్టుకు డెలివర్ చేస్తాడు. ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తాడు. నెట్స్‌లో బంతిని బాగా కొడుతున్నాడు,” అని మోర్కెల్ మీడియాతో అన్నాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. ప్రోటియాస్‌పై గెలిస్తే సెమీఫైనల్ ఆశలకు భారీ బలం చేకూరుతుంది. భారత్ మాదిరిగానే దక్షిణాఫ్రికా కూడా గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లన్నింటినీ గెలిచి అజేయంగా సూపర్–8కు వచ్చింది. అందువల్ల అహ్మదాబాద్‌లో జరగనున్న ఈ ‘హై వోల్టేజ్’ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ అజేయ రికార్డును కొనసాగించాలని తహతహలాడనున్నాయి.
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ/ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ర్పీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..