Abhishek Sharma : 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ప్రపంచ క్రికెట్ లోనే తొలి బ్యాటర్ గా అభిషేక్ సరికొత్త రికార్డు
Abhishek Sharma : ఐర్లాండ్‌పై 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ, అంతర్జాతీయ టీ20ల్లో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో ఐదుసార్లు హాఫ్ సెంచరీ బాదిన ప్రపంచ తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత తరఫున మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Abhishek Sharma : భారత క్రికెట్ జట్టు యువ సంచలనం అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డుతో అంతర్జాతీయ క్రికెట్ ను ఊపేస్తున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఈ డాషింగ్ ఓపెనర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో ఐదుసార్లు హాఫ్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్‌గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఆయన సరిగ్గా 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు, ఇది అతని అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 11వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టిన వైనం
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఏ బ్యాటర్ కు సాధ్యం కాని అరుదైన మైలురాయిని అభిషేక్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు నాలుగు సార్లతో అతని పేరిటే ఉండగా, ఇప్పుడు ఐర్లాండ్ పై 19 బంతుల్లోనే పరుగుల వరద పారించి తన సొంత రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ప్రపంచంలో మరే ఇతర బ్యాటర్ కూడా అంతర్జాతీయ టీ20ల్లో కనీసం నాలుగు సార్లు కూడా 20 బంతుల లోపు హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. దీనితో పాటు ఐర్లాండ్ గడ్డపై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాటర్‌గా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు.
అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల రికార్డు లిస్ట్
అభిషేక్ శర్మ ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో సాధించిన విధ్వంసకర హాఫ్ సెంచరీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
14 బంతుల్లో: న్యూజిలాండ్ జట్టుపై
17 బంతుల్లో: ఇంగ్లాండ్ జట్టుపై
18 బంతుల్లో: న్యూజిలాండ్ జట్టుపై
19 బంతుల్లో: ఐర్లాండ్ జట్టుపై (తాజా మ్యాచ్ లో)
20 బంతుల్లో: ఇంగ్లాండ్ జట్టుపై
దిగ్గజాల సరసన అభిషేక్ శర్మ
భారత క్రికెట్ జట్టులో ఇప్పటివరకు 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనితో పాటు భారత స్టార్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, గౌతమ్ గంభీర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు కూడా 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రికార్డును కలిగి ఉన్నారు.
ఇప్పటికీ చెక్కుచెదరని యువరాజ్ సింగ్ రికార్డు
అభిషేక్ శర్మ వరుస రికార్డులతో దూసుకుపోతున్నప్పటికీ, భారతదేశం తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు మాత్రం ఇప్పటికీ లెజెండరీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిటే భద్రంగా ఉంది. గత 19 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్ లోనే యువీ ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించిన విషయం క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
