భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన ఆర్థిక శక్తిని మరోసారి నిరూపించింది. జయ్ షా కార్యదర్శిగా ఉన్న సమయంలో, బోర్డు బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 20,686 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విజయానికి ప్రధాన కారణాలు ఐపీఎల్ మీడియా హక్కులు, ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ హక్కుల ద్వారా వచ్చిన భారీ ఆదాయంమే.
రెండేళ్ల క్రితం ఐపీఎల్ మీడియా హక్కులను రూ. 48,390 కోట్లకు విక్రయించడం ద్వారా BCCIకి భారీగా లాభాలు వచ్చాయి. అంతేకాదు, భారతదేశం క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా ఉండటంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ద్వారా వచ్చే ఆదాయంలో కూడా సింహభాగం BCCIకి దక్కుతోంది.
2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, 2024 నాటికి దాదాపు రూ. 4,200 కోట్ల పెరుగుదలతో రూ. 20,686 కోట్లకు చేరింది. దీనితో పాటూ జనరల్ ఫండ్స్ కూడా రూ. 6,365 కోట్ల నుంచి రూ. 7,988 కోట్లకు పెరిగాయి.
భవిష్యత్తులో మరింత ఆదాయం సమకూర్చుకోవడానికి బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,054 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ విజయవంతమైన ఎదుగుదల దేశీయ క్రికెట్ యూనిట్లకు కూడా మద్దతుగా నిలుస్తుంది, వాటికి బకాయిలుగా ఉన్న రూ. 499 కోట్ల గ్రాంట్లను త్వరలోనే విడుదల చేయనుంది.