AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: చీపురును నిలువుగా పెడుతున్నారా..? ఆ నష్టాలు తప్పవంట.. పెద్ద కథే ఉందిగా..

చీపురును ఎక్కడ పడితే అక్కడ లేదా నిలువుగా ఉంచకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. చీపురును దక్షిణ దిశలో అడ్డంగా ఉంచడం శుభప్రదమని, పరిశుభ్రతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చీపురుకు సంబంధించిన సంప్రదాయాల వెనుక ఉన్న వాస్తు విశ్వాసాలు, పరిశుభ్రతకు సంబంధించిన ఆచరణాత్మక కారణాల గురించి తెలుసుకుందాం..

Vastu Tips: చీపురును నిలువుగా పెడుతున్నారా..? ఆ నష్టాలు తప్పవంట.. పెద్ద కథే ఉందిగా..
Broom Placement For Vastu
Shaik Madar Saheb
|

Updated on: Jun 29, 2026 | 7:58 AM

Share

మన భారతీయ సంస్కృతిలో ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్ట స్థానం, ప్రాముఖ్యత ఉన్నాయి. ఇంట్లో ప్రతిరోజూ ఉపయోగించే చీపురు కూడా ఈ కోవలోకి వస్తుంది. శుభ్రతకు, సంపదకు ప్రతీకగా భావించే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలంటే, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మన పెద్దలు చెబుతారు. ఈ పరిశుభ్రతను సాధించడంలో చీపురు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దీని స్థానం, నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రాచీన సంప్రదాయాలు, వాస్తు నియమాలు ఉన్నాయి. సాధారణంగా, చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడం సరికాదు. చాలా మంది తెలియక చీపురును ఈశాన్య మూలలో ఉంచుతుంటారు. కానీ, శాస్త్రం ప్రకారం ఇది తగదు. చీపురును శుభ్రపరచడానికి ఉపయోగించిన వస్తువు కాబట్టి.. దీనికి దక్షిణ దిశ అనువైనదని వాస్తుశాస్త్ర నిపుణులు, ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. చీపురును దక్షిణ దిశలో ఎక్కడైనా ఉంచవచ్చు.. కానీ అడ్డంగా పడుకోబెట్టాలి.

చీపురు నిర్వహణలో మరొక ముఖ్యమైన అంశం దానిని నిలువుగా ఉంచకపోవడం.. చీపురును శని దేవుడి ఆయుధంగా పరిగణిస్తారు. అందువల్ల, చీపురును నిలువుగా ఉంచడం ద్వారా ఇంట్లో శని ప్రభావం తాండవిస్తుందని, అది కష్టాలకు దారితీస్తుందని నమ్ముతారు. చీపురును అడ్డంగా పడుకోబెట్టడం లేదా కుచ్చు భాగం కిందికి వచ్చేలా ఉంచడం శ్రేయస్కరం. ఈ పద్ధతి చీపురు పాడవకుండా కాపాడుతుంది.. అదే సమయంలో సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది.

చీపురుకు ఎంతో గౌరవం..

పూర్వం రోజుల్లో పెద్దలు చీపురుకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. పొరపాటున ఎవరైనా చీపురును కాలితో తగిలినా, దాన్ని అమర్యాద చేసినా మందలించేవారు. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదని, దాని వెనుక లోతైన ఆరోగ్య, పరిశుభ్రత అంశాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. చీపురుతో ఊడ్చిన దుమ్ము, ధూళి, క్రిమి కీటకాదులు ఉంటాయి. చీపురును నిలువుగా ఉంచినప్పుడు, ఈ దుమ్ము, క్రిములు మన చేతులపై, బట్టలపై లేదా ఇంట్లో ఆహారంపై పడే అవకాశం ఉంటుంది. ఇది వివిధ రకాల అనారోగ్యాలకు దారితీయవచ్చు. అందుకే, చీపురును సరైన పద్ధతిలో, సురక్షితమైన స్థలంలో ఉంచడం ద్వారా ఇంట్లో ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను కాపాడుకోవచ్చు.

అంతేకాకుండా, చీపురును లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, గృహ వాతావరణాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించే పవిత్ర వస్తువుగా భావిస్తారు. ప్రతి వస్తువునూ పూజింపదగినదిగా భావించే గొప్ప సంస్కృతి మనది. కనుక, చీపురును పాడవుతుందనో, చిన్నచూపు చూసి నిలువుగా పెట్టడమో కాకుండా, సంప్రదాయబద్ధంగా, శుభప్రదంగా దానిని నిర్వహించడం ముఖ్యం. పెద్దలు చెప్పిన ఈ ఆచారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాకుండా, వాటి వెనుక శాస్త్రీయ దృక్పథం, మంచి ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయని గుర్తించాలి. ఈ మంచి విషయాలను పాటించడం ద్వారా ఇంట్లో సంపద, ఆరోగ్యం, శాంతి నెలకొంటాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us