Shani Dev: శనిదేవుడు తొమ్మిది గ్రహాలలో ఒకడు. సాధారణంగా శనిదేవుడిని కర్మను
ఇచ్చేవాడు అంటారు. శని దేవుడి స్వభావం చాలా కోపంగా ఉంటుంది. అతడి రంగు నల్లగా
ఉంటుంది. ఆలయాలలో కూడా శని దేవుడి విగ్రహం నలుపు రంగులోనే ఉంటుంది. శని దేవుడికి
ఇష్టమైన రంగు కూడా నలుపే. నల్లటి నువ్వులు, నల్లటి దుస్తులు, నల్లటి వస్తువులు అతడికి
సమర్పిస్తారు. దీంతో అతడు సంతోషించి తన భక్తులకు ఆశీర్వాదం అందజేస్తాడని నమ్మకం.
అయితే శని దేవుడు రంగు ఎందుకు నల్లగా ఉంటుంది అతను నలుపు రంగును మాత్రమే
ఎందుకు ఇష్టపడతాడు తదితర విషయాలు తెలుసుకుందాం.
శని దేవుడి నలుపు రంగు స్టోరీ
శని దేవుడి నలుపు రంగు గురించి గ్రంథాలలో ఒక స్టోరీ ఉంది. దీని ప్రకారం సూర్య భగవానుడు
దక్ష ప్రజాపతి కుమార్తె సంధ్యను వివాహం చేసుకుంటాడు. సంధ్య, సూర్యదేవ్‌లకు మను,
యముడు, యమునా అనే పిల్లలు పుడుతారు. అయితే సూర్యభగవానుడి తేజస్సును సంధ్య
భరించలేకపోతుంది. ఒకరోజు ఛాయ అనే మహిళని అక్కడ ఉంచి తను తన తండ్రిగారి ఇంటికి
వెళ్లిపోతుంది. అయితే ఛాయ గుణం, రూపంలో సంధ్యను పోలి ఉండటం వల్ల సూర్య భగవానుడు తన భార్య సంధ్యగా భావిస్తాడు. దీంతో కొంతకాలం తర్వాత ఛాయ గర్భవతి అవుతుంది.
అప్పటి నుంచి ఛాయ పరమశివుడిని గురించి తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆమె గర్భం దాల్చడంలో సరైన ఆహారం, జాగ్రత్తలు తీసుకోలేకపోతుంది. దీంతో శని దేవుడు పోషకాహార లోపంతో నల్లటి రంగులో జన్మిస్తాడు. బిడ్డని ఆ రంగులో చూసిన సూర్యభగవానుడు అతనిని తన కుమారుడిగా అంగీకరించడు. దీంతో శని దేవుడికి చాలా కోపం వస్తుంది. గర్భం దాల్చిన సమయంలో ఛాయ పరమశివుడిని ధ్యానించింది కాబట్టి శని దేవుడికి పుట్టినప్పటి
నుంచి మహాదేవుడి అనుగ్రహం ఉంటుంది.
అంతేకాదు అతడు పుట్టుకతోనే చాలా శక్తులతో జన్మిస్తాడు. సూర్యభగవానుడు తిరస్కరణకు గురైన శని దేవుడు చాలా కోపంతో తండ్రిని చూడగానే సూర్యభగవానుడి కూడా నల్లగా మారి కుష్టు వ్యాధితో బాధపడుతాడు. తరువాత సూర్య దేవ్ తన తప్పును గ్రహించి తన తప్పుకు క్షమాపణ కోరడానికి శివుని వద్దకు వెళుతాడు. తరువాత అతడు శని దేవుడిని అన్ని గ్రహాలలో శక్తివంతంగా ఉండమని వరం ఇచ్చాడు. ఆ పరమశివుడు అతడిని కర్మలు ఇచ్చేవాడిని చేశాడు.
శనిదేవుడికి నల్లటి వస్తువుల సమర్పణ
నల్లటి రంగు కారణంగా శనిదేవుడు అవమానానికి గురి కావల్సి వచ్చింది. దీంతో నలుపు రంగు
ఎంత నిర్లక్ష్యానికి గురైందో అతడు గ్రహించాడు. పూజలలో నలుపు రంగుకి ఎటువంటి ప్రాధాన్యత
ఉండదు. ఈ కారణంగా శనిదేవుడు నలుపును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు. అప్పటి
నుంచి శని దేవుడికి నలుపు రంగు వస్తువులను సమర్పించడం ప్రారంభమైంది. దీంతో శనిదేవుడు
చాలా సంతోషిస్తాడు. ఇది కాకుండా మీరు ఎవరికైనా పేద, నిస్సహాయ లేదా ఆపదలో ఉన్న వ్యక్తికి
సాయం చేస్తే శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల
ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.