పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!

Lord Jagannath: నాటి నుంచి నేటి వరకు పూరీ జగన్నాథుడికి అనేక నైవేద్యాలు సమర్పిస్తుండటం కొనసాగుతోంది. ఇందులో ఒక నైవేద్యానికి మాత్రం ప్రత్యేక చరిత్ర, మహత్యం ఉంది. పూరీ జగన్నాథుడికి వేప పొడిని కూడా నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఓ వృద్ధురాలైన భక్తురాలు జగన్నాథుడికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ పొడి తయారు చేసి భక్తితో సమర్పించింది.

పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
Puri Jagannath

Updated on: Mar 22, 2026 | 11:31 PM

నాటి నుంచి కూడా పూరి జగన్నాథ ఆలయంలో మహా వైభవంగా నిత్యనైవేద్యాలు సమర్పించేవారు. అక్కడి ఆచార ప్రకారం జగన్నాథుడు కి ప్రతిరోజూ 56 రకాల భోగాలు సమర్పించబడతాయి. ఈ విశేషాన్ని చూసే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమెకు స్వామివారిపై అమితమైన భక్తి, ప్రేమ. ఆమె ప్రతిరోజూ ఆలయానికి వచ్చి, స్వామివారికి సమర్పించే నైవేద్యాలను చూసేది. ఒక రోజు ఆమె మనసులో ఒక ఆలోచన కలిగింది.. “ఇన్ని రకాల వంటకాలు తింటున్న స్వామివారికి ఎక్కడ కడుపు నొప్పి వస్తుందో? జీర్ణం అవ్వడానికి ఏదైనా కావాలి కదా!” అని. తన తల్లి హృదయంతో ఆలోచించిన ఆమె, ఇంట్లోనే ప్రేమతో వేప ఆకులు ఎండబెట్టి, మెత్తగా దంచి వేప పొడిని తయారు చేసింది.

వేపపొడి..

మరుసటి రోజు, ఆ వృద్ధురాలు ఆ వేప పొడిని తీసుకుని ఆలయానికి వచ్చింది. కానీ ఆలయ ద్వారపాలకుడు ఆమెను లోపలికి అనుమతించలేదు. ఆమె ఎంత వేడుకున్నా వినకపోవడంతో, ఆమె తీసుకొచ్చిన వేప పొడిని కూడా నిర్లక్ష్యంగా పారబోశాడు. బాధతో ఆమె వెనుదిరిగింది.

పూరీ జగన్నాథుడు కలలోకి..

అయితే ఆ రాత్రే ఒక అద్భుతం జరిగింది. పూరి రాజుకు స్వప్నంలో జగన్నాథుడు దర్శనమిచ్చి, “నా భక్తురాలు ఎంతో ప్రేమతో నాకు తీసుకొచ్చిన వేప పొడిని ఆలయంలోకి రానివ్వలేదు. ఆమె భక్తిని గౌరవించలేదు” అని చెప్పాడు. స్వామివారి మాటలు విన్న రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు.

మరుసటి ఉదయం రాజు స్వయంగా ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి, తన కలలో జరిగిన విషయాన్ని వివరించాడు. ఆమెను గౌరవంగా ఆలయానికి ఆహ్వానించి, మళ్లీ అదే ప్రేమతో వేప పొడిని తయారు చేయమని కోరాడు. వృద్ధురాలు ఆనందభాష్పాలతో తిరిగి వేప పొడిని సిద్ధం చేసి, స్వామివారికి సమర్పించింది.

నాటి నేటి వరకు నైవేద్యంగా వేప పొడి

ఆ రోజు నుంచి, పూరి జగన్నాథ ఆలయం లో సమర్పించే నైవేద్యాలలో వేప పొడికి కూడా ప్రత్యేక స్థానం కలిగింది. ఈ కథ భక్తి ఎంత సున్నితమైనదో, దేవుడు భక్తుని హృదయాన్ని మాత్రమే చూస్తాడో తెలియజేస్తుంది.

ఈ కథ మనకు చెప్పే సందేశం స్పష్టంగా ఉంది. దైవానికి సమర్పించే దానం విలువైనది కాదు, దాని వెనుక ఉన్న ప్రేమ, భావమే అసలైన మహిమ.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us