గణేశుడినే ముందుగా ఎందుకు పూజిస్తారు..? దీని వెనుక ఉన్న పురాణ కథ ఇదే!
Lord Ganesh First Puja Story: హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజించడం ఆనవాయితీ. అయితే గణపతికే ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు లభించింది? తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ గణేశుడు చేసిన ప్రదక్షిణల వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం.

Lord Ganesh First Puja Story Telugu: హిందూ సంప్రదాయంలో ఏదైనా కొత్త పని లేదా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడం అత్యంత ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతిని కొలుస్తారు. అందుకే పెళ్లి, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం, పూజలు వంటి ఏ శుభకార్యమైనా ముందుగా గణేశుడిని స్మరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్లలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే శుభకార్యాల్లో గణేశుడినే మొదటగా ఎందుకు పూజిస్తారు? ఈ ప్రత్యేక గౌరవం ఆయనకు ఎలా లభించింది? దీని వెనుక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది.
దేవతల మధ్య మొదలైన పోటీ
పురాణ కథనం ప్రకారం.. ఒకసారి దేవతల మధ్య ‘ముందుగా ఎవరిని పూజించాలి?’ అనే విషయంపై వివాదం ఏర్పడింది. దీనికి పరిష్కారం కోసం దేవతలందరూ శివపార్వతులను ఆశ్రయించారు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు. “మీలో ఎవరు ముందుగా విశ్వమంతా చుట్టి తిరిగి నా వద్దకు చేరుకుంటారో, వారినే ముందుగా పూజించాలి” అని చెప్పాడు. శివుడి మాటలు విన్న వెంటనే దేవతలందరూ తమ తమ వాహనాలపై విశ్వ ప్రదక్షిణకు బయలుదేరారు. కార్తికేయుడు కూడా తన వాహనం నెమలిపై వేగంగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రతి ఒక్కరూ తామే విజయం సాధిస్తామని భావించారు.
గణేశుడి తెలివైన ఆలోచన
అయితే గణేశుడి వాహనం ఎలుక. ఇతర దేవతల వాహనాలతో పోలిస్తే అది చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. దీంతో విశ్వాన్ని చుట్టి రావడం తనకు సాధ్యం కాదని గణేశుడు గ్రహించాడు. అయితే ఆయన నిరాశ చెందలేదు. తన బలాన్ని కాకుండా తెలివిని ఉపయోగించాడు. గణేశుడు తన తల్లిదండ్రులైన శివుడు, పార్వతుల వద్దకు వెళ్లి, వారిని భక్తితో నమస్కరించాడు. అనంతరం వారి చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేశాడు. అది చూసిన శివుడు.. “నువ్వు విశ్వాన్ని చుట్టి రాకుండా మా చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేశావు?” అని ప్రశ్నించాడు.
అప్పుడు గణేశుడు వినయంగా ఇలా సమాధానమిచ్చాడని పురాణ కథనం: “తల్లిదండ్రుల పాదాల వద్దే సమస్త విశ్వం ఇమిడి ఉంది. తల్లిదండ్రులను ప్రదక్షిణ చేయడం అంటే విశ్వాన్నే ప్రదక్షిణ చేసినట్లే.” గణేశుడి సమాధానం విన్న శివపార్వతులు ఎంతో సంతోషించారు. అక్కడున్న దేవతలంతా కూడా ఆయన జ్ఞానానికి, తల్లిదండ్రుల పట్ల ఉన్న భక్తికి ఆశ్చర్యపోయారు. విశ్వంలో దేవతలందరికంటే ముందుగానే అక్కడికి గణపతి వెళ్లినట్లుగా కనిపించడంతో వారికి అసలు రహస్యం అర్థమైంది.
అందుకే గణపతిని ముందుగా పూజిస్తారు
గణేశుడి భక్తి, జ్ఞానం, సమయస్ఫూర్తికి సంతోషించిన శివుడు ఆయనకు ఒక ప్రత్యేక వరాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మూడు లోకాలలో ఏ శుభకార్యం ప్రారంభమైనా ముందుగా గణేశుడినే పూజించాలని శివుడు వరమిచ్చాడని విశ్వాసం. గణపతిని స్మరించి పూజించడం ద్వారా కార్యాల్లో ఎదురయ్యే విఘ్నాలు తొలగి, విజయసిద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే నేటికీ ఏ శుభకార్యమైనా “శ్రీ గణేశాయ నమః” అంటూ గణపతిని ముందుగా స్మరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గణేశుడి కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది—బలంతో సాధించలేనిదాన్ని బుద్ధి, భక్తి, సమయస్ఫూర్తితో సాధించవచ్చు.
(Disclaimer: ఈ కథనం పురాణాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడింది. వీటిని శాస్త్రీయ వాస్తవాలుగా కాకుండా ఆధ్యాత్మిక విశ్వాసాలుగా పరిగణించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్దరించడం మంచిది.)
