
గణపతిని పూజించకుండా ఏ శుభ కార్యమూ మొదలు పెట్టరు. ఆ కార్యం పూర్తి కాదు. గణపతిని విఘ్నాలకధిపతి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తాడు. గణపయ్య అనుగ్రహంతో జీవితంలోని అన్ని సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. జీవితంలో చాలాసార్లు అకస్మాత్తుగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగంలో పదోన్నతి రాకపోవడం, డబ్బు కోల్పోవడం, వివాహంలో అడ్డంకులు మొదలైన వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఈ సమస్యలన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉన్నప్పటికీ, ఈ సమస్యల నుండి బయటపడటం కూడా చాలా ముఖ్యం. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు గణపతిని పూజించాలి. బుధవారం చేసే కొన్ని ప్రత్యేక నివారణలు, పూజలు సమస్యలను తొలగించడమే కాదు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి. కనుక గణేశుడిని ప్రసన్నం చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడి దుఃఖాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
జీవితంలో దుఃఖం నుంచి ఉపశమనం
మీ జీవితంలో ఏదైనా దుఃఖం ఎదురవుతుంటే బుధవారం రోజున గణపతిని గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత భక్తితో గణపతి అథర్వశీర్ష పారాయణం చేయాలి. అంతే కాదు ఉండ్రాళ్ళు, కుడుములు దేవునికి సమర్పించి, ప్రసాదాన్ని పేదలకు పంచాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం లభిస్తుంది.
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి చర్యలు
కారణం ఏదైనా ఆర్థిక సంక్షోభం ఒక వ్యక్తిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితిలో బుధవారం ఉదయం గణపతి ఆలయానికి వెళ్లి అక్కడ నెయ్యి దీపం వెలిగించి దేవునికి బెల్లం నైవేద్యం పెడితే, మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మాత్రమే కాదు బెల్లం ఆవుకు కూడా తినిపించాలి. ఇది ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది.
ఉద్యోగ సంక్షోభాన్ని అధిగమించడానికి చర్యలు
కోరుకున్న ఉద్యోగం రాకపోయినా, ఉద్యోగంలో సంక్షోభం ఉన్నా లేదా మీకు పదోన్నతి రాకపోయినా బుధవారం రోజున గణపతిని పూజించండి. ఈ రోజున ఇంటిలోని పూజ గదిలో పసుపుతో గణపతిని చేసి లేదా గణపతి పసుపు విగ్రహన్ని తీసుకువచ్చి, ఆపై ఐదు పసుపు కొమ్ములను భగవంతుని పాదాల వద్ద సమర్పించండి. దీని తరువాత భగవంతుని ముందు శ్రీ గణాధిపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. దీని తరువాత, 108 దర్భలను తీసుకుని పసుపు అద్ది శ్రీ గజవక్త్రం నమో నమః జపిస్తూ పూజించండి.
ఏదైనా కోరిక నెరవేర్పు కోసం
బుధవారం నాడు ఆలయానికి వెళ్లి గణేశుడి పాదాలకు దర్భల గడ్డిని సమర్పించి ఆ తర్వాత బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేసే వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావు. గణపతి ప్రతి కోరికను నెరవేరుస్తాడు.
వివాహంలో అడ్డంకులు తొలగించే పరిహారాలు
ఒక అమ్మాయి వివాహంలో ఏదైనా సమస్యలున్నా లేదా ఆలస్యం అవుతున్నా గణేశుడిని పూజించాలి. బుధవారం రోజున మల్పువాను గణేశుడికి సమర్పించాలి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండండి. అబ్బాయి వివాహంలో ఏదైనా సమస్య కలుగుతుంటే.. గణేశుడికి పసుపు రంగు స్వీట్లు నైవేద్యంగా సమర్పించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.