హిందూ సంప్రదాయంలో పసుపు శుభసూచికంగా భావిస్తాం.. తెలుగువారి ఆచార వ్యవహారాల్లో పసుపుకు అధిక ప్రాధాన్యత ఉంది. గుడి గోపురాల్లో పసుపుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. శ్రావణ మాసం మొదలు కావటంతో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా భ్రమరాంబ అమ్మవారిని చందనం, చీరెల,గాజులు అలంకరణతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే ఈ ఏడాది శ్రావణ శుక్రవారం మొదటి రోజు పసుపు కొమ్మలతో అమ్మవారికి విశేష అలంకరణ చేశారు.
నంబూరుకు చెందిన కిషోర్ రెడ్డి, వాణి దంపతులు, చిలకలూరిపేటకు చెందిన శంకర్ మరొక భక్తుడు కలిసి 400 కిలోల పసుపు కొమ్మలును అమ్మవారికి సమర్పించారు. వీటితో మొదటి శ్రావణ శుక్రవారం ప్రత్యేక అలంకరణ చేశారు. పసుపుతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుంటే తాము సౌభాగ్యంతో విలసిల్లుతామని మహిళలు భావిస్తారు. దీంతో భక్తుల సాయంతో మొదటి రోజు పసుపు కొమ్మలుతో విశేష అలంకరణ చేశారు. పసుపు కొమ్ములతో చేసిన అమ్మవారిని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ రోజు మొత్తం కూడా అమ్మవారి పసుపు కొమ్ముల అలంకరణలోనే దర్శన మిస్తారని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో వైపు శ్రావణ మాసం ప్రారంభంకావటంతో అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక చివరి శుక్రవారం సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం చేయిస్తున్నట్లు ఈవో చెప్పారు. ముత్తైదవులు పెద్ద సంఖ్యలో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొంటారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని సిబ్బంది తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..