Statue of Equality: జయహో శ్రీరామనగరి.. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. నగర శివార్లలోని ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహంలో ఆయన..
Amit Shah -Statue of Equality: ఇలవైకుంఠాన్ని తలపిస్తోన్న శ్రీరామనగరం-ఏడో రోజు వైభవోపేతంగా శ్రీ భగవద్రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. నగర శివార్లలోని ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహంలో ఆయన పాల్గొంటున్నారు. ఆశ్రమంలోని ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ఆయన సందర్శిస్తారు. దీంతో పాటు ఆశ్రమంలో నిర్మించిన 108 దివ్యదేశాలు (ఆలయం)ని కూడా హోంమంత్రి సందర్శిస్తారు. యాగశాలలో నిర్వహించే యాగాల్లో అమిత్ షా కూడా పాల్గొనబోతున్నారు.
అంతకు మందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో లక్నో నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తదితరులు స్వాగతం పలికారు. అభివాదం చేసిన బండి సంజయ్ ని ఆయన అభినందన పూర్వకంగా భుజం తట్టడం విశేషం. అక్కడి నుంచి నేరుగా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరికి చేరుకున్నారు. అందుకోసం ఆయన విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లారు.
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏడోరోజు శ్రీరామనగరంలో రథ సప్తమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. నేడు యాగశాలలో దుష్టగ్రహ బాధానివారణకై శ్రీనారసింహ ఇష్టి, జ్ఞాన జ్ఞానాకృత సర్వవిధ పాపనివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువులో భాగంగా పెరుమాళ్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద పారాయణం జరిగింది. ఆదిత్య హృదయ సామూహిక పారాయణం చేశారు. అనంతరం శ్రీనారాసింహ అష్టోత్తర శతనామావళి పూజను అహోబిలం రామానుజజీయర్ స్వామీజీ నిర్వహించారు.
11వ శతాబ్దానికి చెందిన వైష్ణవ గురువు శ్రీరామానుజాచార్యుల స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. శ్రీ రామానుజాచార్యుల సమానత్వ సందేశాన్ని ప్రశంసిస్తూ.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రంతో తమ ప్రభుత్వం అదే స్ఫూర్తితో దేశ నూతన భవిష్యత్తుకు పునాది వేస్తోందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు.
ఇవి కూడా చదవండి: TS RTC: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టీవీ9తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ ఇంటర్వ్యూ..