
మరికొద్ది గంటల్లోనే మనం నూతన తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మార్చి 19, గురువారం నాడు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని జరుపుకోనున్నారు. ఈ రోజున చాలా మంది కొత్త బట్టలు ధరించి పూజలు చేసి, ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తారు. ఉగాది రోజున కొన్ని విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం శుభఫలితాలు లభించి, దేవతల అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
గతంలో ఎదురైన అపజయాలు, కష్టాలు, బాధలు అన్నింటినీ వెనక్కి నెట్టి, ఆత్మవిశ్వాసంతో కొత్త ఆరంభం చేయాలని సూచించేదే “పరాభవ” అనే పేరుకు అంతరార్థమని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.
ఉగాది పర్వదినం రోజున తెల్లవారుజామున లేచి, శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి. దీనిని తైలాభ్యంగ స్నానం అంటారు.
అలాగే ఈ రోజున బ్రహ్మదేవుని పూజించడం ముఖ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శ్రీమహావిష్ణువు ఆజ్ఞతో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు ఇదేనని విశ్వసిస్తారు.
బ్రహ్మదేవునికి సాధారణంగా విగ్రహాలు లేదా చిత్రాలు ఉండవు. కాబట్టి ఇలా పూజ చేయాలి:
కొత్త కుండను తీసుకుని పసుపు, కుంకుమతో అలంకరించాలి. అందులో నీళ్లు నింపి, పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షతలు వేయాలి. తర్వాత కొబ్బరికాయపై పసుపు, కుంకుమ రాసి దారంతో కట్టి కుండపై ఉంచి, అర్చకులకు దానం చేయాలి. ఇలా చేస్తే అష్టైశ్వరాలతోపాటు దేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు ధృవీకరించదు.)