పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేసే విధంగా మరో నిర్ణయంతీసుకుంది టీటీడీ. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించే ఆలోచనలో ఉంది. తిరుమలలో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేసేలా తాటాకు బుట్టలను ప్రయోగత్మకంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
తాటాకు బుట్టల వినియోగాన్ని అమల్లోకి తెస్తే.. ఓ వైపు ప్లాస్టిక్ వినియోగం తగ్గి.. పర్యవర్ణా పరిరక్షణ జరగడమే కాదు.. మరోవైపు హస్తకళలను ప్రోత్సహించినట్లు ఉంటుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ తాటాకులతో వివిధ సైజ్ ల్లో తయారు చేసిన బుట్టలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ తాటాకు బుట్టలను త్వరలోనే లడ్డు కౌంటర్లల్లో వాడకంలోకి తీసుకురానున్నామని చెప్పారు ధర్మారెడ్డి. ఈ సమయంలో తాటాకు బుట్టల వినియోగం సాధ్యాలతోపాటు లడ్డు ప్రసాదాలను తీసుకెళ్లే భక్తులకు తాటాకు బుట్టలు ఎంతమేర ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై టీటీడీ అధ్యయనం చేయనుంది.
ఇప్పటికే తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించడం లేదు. అంతేకాదు ఆలయానికి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను ఇప్పటికే నిషేధించడమే కాదు.. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు గాజు సీసాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..