హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి పుట్టినరోజు సంబరాలకు సిద్ధమైంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న టెంపుల్ సిటీ ఈరోజు వేడుకలకు సిద్ధమైంది. మా ఊరి పుట్టినరోజు పేరుతో తిరుపతి బర్త్ డేను జరుపుతున్న మానస వికాస వేదిక ఇది జగతికి స్ఫూర్తి అంటోంది. అసలేంటీ ఉత్సవం? తిరుపతికి పుట్టినరోజు వేడుకల వెనకున్నఅసలు కథ ఏమిటో తెలుసుకుందాం..
శ్రీ మహా విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో ఇది ఒకటి. రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. 1130వ సంవత్సరం.. ఫిబ్రవరి 24న అద్భుతం జరిగింది. సౌమ్య నామ సంవత్సరం పాల్గుణ పౌర్ణమి ఉత్తరా నక్షత్ర సోమవారం రోజు తిరుపతి నగరం వెలసింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత వెలసిన నగరం ఇది. 893 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. పట్టణ అభివృద్ధికి నాంది పలికారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గతేడాది ఫిబ్రవరి 20న పురాతన శాసనాలను తెప్పించారు. ఇందులో ఈ నగరానికి 1130 ఫిబ్రవరి 24న రామానుజాచార్యులు శంకుస్థాపన చేసినట్లు రుజువులు దొరికాయి. ఈ ఆధారాలు టీటీడీ ఆధ్వర్యంలోని గోవిందరాజ ఆలయంలో వెలుగులోకి వచ్చాయి. భూమన కరుణాకర్ రెడ్డి గత రెండేళ్లుగా తిరుపతి పుట్టినరోజును వేడుకగా జరుపుతున్నారు.
గోవిందరాజపట్నంగా ఆ తరువాత రామానుజాపురంగా పిలిచే నేటి తిరుపతి 12వ శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నట్లు ఎన్నో ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. తిరుపతి నగర వాసులను భాగస్వామ్యం చేస్తూ మానస వికాస వేదిక గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఈరోజు అర్చకులు, మేళతాళాలు వివిధ కళారూపాల ప్రదర్శనలతో తిరుపతి పుట్టినరోజు పండుగ వేడుకగా జరుపనున్నారు.
తిరుమల-తిరుపతి క్షేత్రం నేడు భారతదేశంలో హిందువుల ఆరాధనకు చిహ్నంగా మారింది. ప్రపంచంలోని అత్యంత ధనిక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉంది, అంతేకాదు.. రామానుజుల రాకకు ముందు తిరుచానూరులో శ్రీవారి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ పట్టణాన్ని మొదట గోవిందరాజ పట్టణం అని, తరువాత రామానుజ పురం అని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతి అని పిలుస్తున్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ గోవిందరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పౌర సంఘం అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..