
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటనాధుని దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాలనుంచి తరలి వస్తారు. శ్రీ మన్నారాయణుని కళ్లారా చూసి తరించాలని గంటలు తరబడి క్యూలైన్లలో నిలబడి శ్రీనివాసుని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కోసం లడ్డూ కౌంటర్ కు చేరుకుంటారు. అవును తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది లడ్డు.
భక్తులు భక్తిశ్రద్ధలతో అత్యంత ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం.
తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డు ఉన్న స్థానంలో వడ ఉండేది. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే సమయంలో అంటే 19వ శతాబ్దం మధ్యలో స్వామి వారికి ప్రసాదంగా తీపిబూందీని ప్రవేశపెట్టారు. కలాక్రమంలో 1940ల నాటికి ఈ తీపి బూంది లడ్డూగా మారింది.
శ్రీవారి భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. అయితే స్వామివారి ప్రసాదాల్లో వడ ఒక్కటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మిగిలినవి ఏవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాదు. అప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడ కోసం చూసేవారు. దీంతో వడకు భారీ డిమాండ్ నెలకొంది.
ఈ సమస్యని గుర్తించిన అప్పటి బ్రిటిష్ వారి అధ్వర్యంలో మద్రాసు ప్రభుత్వం మొదటి సారిగా 1803లో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం మొదలు పెట్టింది. అంతేకాదు తీపి బూందీని తీపిప్రసాదంగా భక్తులకు అందించడం మొదలు పెట్టిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. మొదట్లో బియ్యప్పిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా పంచేవారట. బియ్యప్పిండి, బెల్లం కలిపి తయారు చేసిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. మనోహరాల గురించి హంసవింశతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది. అంటే మూడువందల యాభయ్యేళ్ళ క్రితం వరకూ మనోహరం స్వామివారి ప్రసాదంగా పంచే ఒక ప్రసిధ్ధ తీపి వంటకం. ఇలా మొదలైన తీపి బూంది రకరకాలుగా మారుతూ వచ్చి చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది.
ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, దేశీ నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. ఈ లడ్డూలు నాలుగు రకాలుగా భక్తులకు అందిస్తున్నారు. ఆస్థానం లడ్డూ, కళ్యానోత్సవ లడ్డు, ప్రోక్తం లడ్డులు, చిన్న లడ్డులుగా భక్తులకు అందజేస్తున్నారు.
ఆస్ధానం లడ్డూ : ఈ ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేస్తారు. ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఈ లడ్డుని అందజేస్తారు. ఈ లడ్డు బరువు 750 గ్రాములు. ఈ లడ్డుని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంత మామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు.
కళ్యాణోత్సవ లడ్డూ: కల్యాణోత్సవం, ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు, భక్తులకూ కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల వగపడిలో లభిస్తాయి. అయితే గత కొంత కాలంగా ఈ లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. కౌంటర్ లో కల్యాణోత్సవ లడ్డులు లభిస్తున్నాయి.
ప్రోక్తం లడ్డూ: వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. కొన్ని రకాల ఆర్జితసేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. ఈ లడ్డూలను శ్రీవారి ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. దీని బరువు సుమారు గ్రా. 175. ఈ లడ్డు అందరికీ తెలిసిందే.
చిన్న లేదా ఉచిత లడ్డూ: సుమారు 25 గ్రాముల బరువు ఉంటుంది. దర్శనం తర్వాత భక్తులకు ఉచితంగా అందించబడుతుంది.
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే ప్రసాదాల కంటే తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ దొరికే లడ్డు రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. కనుక తిరుపతి లడ్డు తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు