తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజులపాటు పవిత్రోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలకు 14న అంకురార్పణం శాస్త్రక్తంగా జరగనుంది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగిన దోషాలు, భక్తులు యాత్రికలు తెలియక చేసిన తప్పులు వల్ల ఈ దోషం రాకుండా నివృత్తి కోసం టీటీడీ ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తోంది. శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను అర్చకులు నిర్వహించనున్నారు. తిరుమల ఆలయంలో 15-16 శతాబ్దాల వరకు పవిత్రోత్సవాలు జరిగినట్టు ఆధారాలు ఉండగా, 1962 నుంచి టిటిడి పవిత్రోత్సవాలను పునరుద్ధరించింది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. 15న పవిత్రాల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్న టిటిడి.. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న జరగనున్న అంకురార్పణ తో సహస్రదీపాలంకార సేవను రద్ధు చేసింది. 15న తిరుప్పావడతోపాటు 15 నుండి 17 వరకు 3 రోజులు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు కూడా రద్దు చేసింది టిటిడి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..