తిరుమల నిత్య కల్యాణం..పచ్చ తోరణం! ఏడాది పొడవునా శ్రీవారి సన్నిధికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. దేవదేవుడిని దర్శించుకుని తరించిపోతారు. శ్రీనివాసుడిని ఒక్కసారి కన్నులారా చూసి తరించిపోతారు. కోర్కెలు తీర్చే కోనేటిరాయుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం వివిధ రూపాల్లో శ్రీవారికి హుండీ ద్వారా కానుకలు సమర్పించుకుంటారు. విదేశీ భక్తులు వారి కరెన్సీని శ్రీవారి హుండీలో వేస్తుంటారు. అంతే భూమి ఉన్న అన్ని ప్రదేశాల నుంచి శ్రీవారి భక్తులు వస్తుంటారు.
ఇలా వచ్చిన భక్తులు తన దేశానికి సంబంధించిన కరెన్సీని మొక్కుల రూపంలో చెల్లించుకుంటారు. ఇలా తమ వద్ద ఉన్న విదేశీ కరెన్సీని అక్కడి హుండీల్లో వేస్తుంటారు. ఇలా ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉండగా శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వస్తుంటుంది. విషయానికి వస్తే మలేషియా కరెన్సీ నోట్లు అత్యధికంగా 46 శాతం వచ్చాయి. మలేషియా కరెన్సీ తర్వాతి స్థానంలో అమెరికా డాలర్లు ఉంటున్నాయి. శ్రీవారి హుండీలో అమెరికా డాలర్లు 16 శాతం ఉన్నట్లుగా గతంలో టీటీడీ వెల్లడించింది.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీలో పాకిస్తాన్ నోట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 2019-20 సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలో శ్రీవారికి రూ. 27.49 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఈ ఏడాది వీదేశీ నోట్లు తగ్గే అవకాశం ఉంది.
అలాంటి శ్రీవారి హుండీకి ఓ పాతనోట్ల చిక్కొచ్చి పడింది.. 2016లో మోదీ ప్రభుత్వం.. పెద్ద నోట్లు రద్దు చేసింది. అప్పట్లో కొందరు భక్తులు ఈ పెద్ద నోట్లను స్వామి వారి హుండీలో వేసేశారు. వీటిలో వెయ్యి నోట్లు- 1. 8 లక్షలు, 500 నోట్లు 6. 34 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం 49. 70 కోట్ల రూపాయల వరకూ ఉంది. అంటే సుమారు యాభై కోట్ల రూపాయలు. ఇది చాలా చాలా పెద్ద మొత్తం. దీంతో శ్రీవారి పేరిట ఉన్న ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో మరెన్నో ప్రజా సేవలు చేయవచ్చు. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాయకత్వంలోని టీటీడీ బోర్డు ఎన్నోమార్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు.