Tirumala Ratha Saptami 2021: లోక బాంధవుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి జన్మదినాన్ని పురష్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ వైభంగా నిర్వహిస్తోంది. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శన మివ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన రథసప్తమి వేడుకలు చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. ఇప్పటికే ఆలయాన్ని 7 టన్నుల పుష్పాలతో ప్రత్యేక అలంకరించారు.. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన అనంతరం అర్చకులు ప్రత్యేక హారతులిచ్చారు. నైవేద్యం సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఉదయం 8గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనంపై, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం చేయనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 వరకు సర్వ భూపాల వాహనంపై, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.ఈరోజు ఒక్కరోజే ఏడు వాహనాలపై శ్రీవారి దర్శించుకునే వీలుండడంతో భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు భక్త జనసంద్రంగా మారాయి.
Also Read: