AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకుంటున్నారా.. మొదటి సారి చేసే భక్తుల కోసం పూర్తి వివారాలు..

మొదటిసారిగా తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసేవారు పూర్తి వివరాలు తెలుసుకోవడం వలన అంగప్రదక్షిణ సులభంగా చేయవచ్చు.. ఈరోజు అంగప్రదక్షిణ టికెట్లు ఎక్కడ ఇస్తారు.. ఆలయానికి ఎప్పుడు ఏ సమయంలో చేరుకోవాలి.. ఏ విధమైన నియమాలు పాటించాలి తెలుసుకుందాం..

Tirumala: శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకుంటున్నారా.. మొదటి సారి చేసే భక్తుల కోసం పూర్తి వివారాలు..
Angapradakshinam In Tirumal
Surya Kala
|

Updated on: Jul 03, 2022 | 6:37 AM

Share

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రం.. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం.. తెలుగు రాష్ట్రాల సహా దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తారు. అయితే స్వామివారి సన్నిధిలో అంగప్రదిక్షణ చేయాలనుకునే భక్తులు కూడా అధికంగా ఉంటారు. శ్రీవారి సన్నిధిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. ఆ అనుభూతిని వర్ణించడానికి కూడా మాటలు చాలవు అని భక్తులు అంటారు. అయితే మొదటిసారిగా అంగప్రదక్షిణ చేసేవారు పూర్తి వివరాలు తెలుసుకోవడం వలన అంగప్రదక్షిణ సులభంగా చేయవచ్చు.. ఈరోజు అంగప్రదక్షిణ  టికెట్లు ఎక్కడ ఇస్తారు.. ఆలయానికి ఎప్పుడు ఏ సమయంలో చేరుకోవాలి.. ఏ విధమైన నియమాలు పాటించాలి తెలుసుకుందాం..

అంగప్రదక్షిణ చేసే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అంగప్రదక్షిణ చేసే భక్తులు రాత్రి 12 గం. సమయంలో శ్రీవారి పుష్కరిణిలో ఒంటిమీద బట్టలతోనే మూడు మునకలు వేసి అలాగే తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా వెళ్ళాలి.  రిపోర్టింగ్ సమయం.. రాత్రి.. ఒంటి గంట.. కనుక ఆ సమయానికే క్యూ లైన్ దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ టికెట్, ఐడిని చెక్ చేసిన అనంతరం.. సెక్యూరిటీ భక్తులను ఆలయం లోపలి అనుమతిస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్లో కి ప్రవేశం ఉంటుంది.

వేంకటేశ్వరునికి సుప్రభాత సేవ మొదలైన తరవాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు. దాదాపు తెల్లవారు జాము 2:45 గంటల సమయంలో మొదట స్త్రీలను అంగప్రదక్షిణకోసం పంపుతారు. తరువాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాతం జరుగుతున్న సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది. తర్వాత భక్తులను స్వామివారి వెండి వాకిలి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెడతారు. స్త్రీలందరూ ప్రదక్షిణ పూర్తి చేసి వెండి వాకిలి దగ్గరకు రాగానే పురుషులను అంగప్రదక్షిణకు అనుమతి ఉంటుంది. అంగప్రదక్షిణ పూర్తి చేసిన పురుషులను  వెండి వాకిలి బైట కళ్యాణ మండపం వద్ద కూర్చోబెడతారు.

ఇవి కూడా చదవండి

ఇంతలో శ్రీవారి సుప్రభాత సేవ పూర్తవుతుంది. దర్శనం చేసుకొన్న భక్తులు బైటకు రాగానే అంగప్రదక్షిణ భక్తులు స్త్రీలను దర్శనం కోసం అనుమతించిన వెంటనే పురుషులకు అనుమతిస్తారు.

సాంప్రదాయ దుస్తులు: 

అయితే అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సి ఉంటుంది. స్త్రీలు భారతీయ సాంప్రదయాన్ని అనుసరిస్తూ.. చీరలు, లంగా వోణీ వంటివి ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె పైన కండువా ధరించాల్సి ఉంటుంది.  షార్ట్, ట్రాక్ ప్యాంట్, టి షర్ట్, చొక్కా, జీన్స్ ప్యాంట్ వంటి దుస్తులను ధరించి వెళ్లే భక్తులను అంగప్రక్షిణకు అనుమతించరు.

ప్రదక్షిణ ఎలా ఉంటుంది? ఎన్నీ ప్రదక్షిణలు??

ప్రదక్షిణ స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ  శ్రీవారి హుండీ (ధనలక్ష్మి విగ్రహం వరకు) చేరుకోవాలి. అప్పుడు ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ప్రదక్షిణలు చేయడం (దొర్లడం)లో ఇబ్బంది కలగకుండా (స్త్రీలు) శ్రీవారి సేవకులు పర్యవేక్షణ చేస్తారు.. కనుక ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు.

అంగప్రదక్షిణ టిక్కెట్: స్వామివారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు దీని టిక్కెట్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనవసరం లేదు. ఆన్లైన్ ద్వారా ఈ అంగప్రదక్షిణ టిక్కెట్ ఉచితంగా పొందొచ్చు. మోబైల్ నెంబర్ తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం, 1 ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..