
సాధారణంగా సెలవు దినాల్లోనే చాలా మంది తమ చేతులు, కాలి వేళ్లకు ఉన్న గోర్లు కత్తిరించుకుంటూ ఉంటారు. హిందూమతంలో గోర్లు కత్తిరించుకునేందుకు పలు సూచనలు ఉన్నాయి. ఏ రోజు కత్తిరించుకోవాలి? ఏ రోజు కత్తించుకోకూడదని స్పష్టంగా చెబుతున్నాయి. శకున శాస్త్రంలో గోర్లు కత్తిరించే ప్రక్రియకు పలు నియమాలు ఉన్నాయి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు.
కానీ, కొన్ని రోజుల్లో గోర్లు కత్తిరించడం అశుభమని నమ్ముతున్నారు. ఆ రోజుల్లో గోర్లను కత్తిరించడం వల్ల ఆర్థిక నష్టంతోపాటు వారి జీవితంలో అనేక ప్రతికూల మార్పులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే గోర్లు తీసుకునే ముందు ఈ విషయాలను తెలుసుకోవాలి.
ఆదివారం
ఆదివారంనాడు సెలవు దినం కావడంతో చాలా మంది గోర్లు కత్తిరించుకుంటారు. కానీ, ఆ రోజున గోర్లు కత్తిరించుకుంటే మాత్రం తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అందుకే, ఆదివారంనాడు పొరపాటున కూడా గోర్లు కత్తిరించుకోకూడదని శాస్త్రం చెబుతోంది. ఆదివారం ఆత్మ, గౌరవం, ఆరోగ్యాన్ని సూచించే సూర్య భగవానుడి రోజుగా పరిగణిస్తారు. ఇక, శకున శాస్త్రం ప్రకారం ఆదివారం రోజున గోర్లు కత్తిరించడం వల్ల గౌరవం, సంపద, ఆరోగ్యం కోల్పోతారు.
మంగళవారం
మంగళవారం శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజున సుబ్రహ్మణ్యస్వామిని కూడా పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం మంగళవారంనాడు గోర్లు కత్తిరించడం వల్ల ధైర్యం కోల్పోతారు. ఆత్మవిశ్వాసం క్రమంగా తగ్గిపోతుంది. అప్పులు పెరిగిపోతాయని హెచ్చరిస్తోంది.
గురువారం
గురువారంరోజున శ్రీ మహా విష్ణువుతోపాటు మహా శివుడు, దత్తాత్రేయుడు, ఇతర ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన ప్రత్యేక రోజుగా పరిగణిస్తారు. ఈరోజున గోర్లు కత్తిరించడం వల్ల బృహస్పతి గ్రహం బలహనీపడుతుందని.. దీంతో ఒక వ్యక్తి తెలివితేటల తగ్గుతాయని నమ్ముతారు. ఆర్థికంగా నష్టపోతారు. ఈ రోజున మీ కుటుంబంలో ఎవరూ గోర్లు కత్తిరించుకోకపోవడమే మంచిది.
శనివారం
శనివారం శనిదేవుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజు గోర్లు, వెంట్రుకలు కూడా శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల శనివారంనాడు గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. మీకు ఆర్థికంగా నష్టపోయి పేదరికం అనుభవిస్తారు.
గోర్లను ఎప్పుడు కత్తిరించాలి?
శకున శాస్త్రం ప్రకారం ఆది, మంగళ, గురు, శనివారాల్లో గోర్లు తీసుకోకూడదని తెలుకున్నాం. ఇప్పుడు ఏయే రోజుల్లో గోర్లు తీసుకోవచ్చో తెలుసుకుందాం. మీరు సోమ, బుధ, శుక్రవారాల్లో మీ గోర్లను కత్తిరించుకోవచ్చు. అయితే, ఈ రోజుల్లో అమావాస్య, ఏకాదశి లేదా ఏదైనా ఇతర ప్రధాన పండగ, ఉపవాస రోజుల్లో వస్తే మాత్రం గోర్లు తీసుకోవద్దని సూచిస్తోంది.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.