లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనా పరిస్థితులతో గత ఏడాది సరిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు చెప్పగా.. స్వర్ణలత దానికి సమాధానమిచ్చారు. మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టినా.. నన్ను నమ్మి పూజలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను మీ వెంట ఉండి నడిపిస్తా.. అమ్మకి ఇంత చేసినా ఏం ఒరగలేదు అనొద్దు.. ప్రతి ఒక్కరినీ నేను కాచుకుంటా. ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వనన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ మహంకాళి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం జరిగింది. మాతంగి పచ్చికుండపై నిలబడి తనలోకి అమ్మవారిని ఆవహించుకొని భవిష్యవాణి చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ స్వర్ణలత రంగం వినిపించారు.
దేశంలో జరిగే.. జరగబోయే విషయాలను రంగం ద్వారా స్వయంగా అమ్మవారే చెబుతారనే విశ్వాసం భక్తుల్లో ఉంది. గతేడాది చెప్పినట్టుగానే హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి.