
తల్లితనం కోసం ఎదురుచూసి, అలసిపోయిన మహిళలకు ఆ ఆలయం ఒక ఆపన్న హస్తంలా కనిపిస్తుంది.. ఆలయంలో నిద్ర చేస్తే చాలు దోషాలు తొలగి అమ్మ అనే కమ్మని పిలుపు సొంతమవుతుందనేది ఈ ఆలయానికి వస్తున్న వారి నమ్మకం. ఈ నమ్మకం ఊరు, వాడ, జిల్లా, రాష్ట్రం నలుమూల వ్యాపించడంతో ఈ పురాతన ఆలయానికి భక్తజనం పోటెక్కుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వంటి కొన్ని విశిష్ట రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు లేని ఆలుమగలు ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పూజలు చేసిన భార్యాభర్తలు తిరిగి సంవత్సర కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు.. ఇంతటి ప్రాచుర్యం కలుగుతున్న ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పాములు మల్లవరంగా పిలిచే ఏకే మల్లవరం గ్రామంలో ఉంది. సంతానం లేని దంపతులకు ఒక వరంలా కనిపిస్తున్నాడు
మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్తులు సర్ప దోష పూజలను ఎక్కువగా నిర్వహిస్తారు. సంతానం లేని దంపతులు ఈ దేవాలయంలో దోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు.. దానితో ఇక్కడకు విచ్చేసిన దంపతులకు పిల్లలను అనుగ్రహించే స్వామిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ పూజలు అందుకుంటారు. అలవెల్లి మల్లవరం అని పిలుచుకునే ఏకే మల్లవరం గ్రామంలో దేవాలయం సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయం సర్ప దోష పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి విచ్చేసిన సంతానం లేని మహిళలు నాగులు చీర, ధరించి గర్భగుడి వెనకాల ఉన్న శయన మందిరంలో గంటసేపు నిద్రిస్తారు. తరువాత దంపతులు ఇరువురు కలిసి ఆలయంలో జరుగు అభిషేకాలలో పాల్గొని దోష నివారణ పూజలు చేస్తుంటారు.
గతంలో ఈ ప్రాంతాన్ని చోళులు పరిపాలించే వారని, దానికి ఆధారంగా ఒక రైతుకు పొలంలో రాగి రేకులతో కూడిన కొన్ని శాసనాలు తాళపత్ర గ్రంధాలు దొరికాయని ఇక్కడ వారు చెబుతుంటారు. 1960వ సంవత్సరంలో తాళపత్రాలు దొరికిన పొలంలో రైతుకు విశిష్టమైన పెద్ద నాగుపాము నిత్యం కనిపించేదని, 1962లో ఆ పాము ఉన్న ప్రాంతం మల్లవరం గ్రామంలో కొంతమంది పెద్దలు కలిసి ఆలయ శంకుస్థాపన చేశారట. శంకుస్థాపన జరిగిన తర్వాత పాము స్వామిగా అవతరించారని ఆలయ అర్చకులు తెలిపారు. అలాగే మరి కొంత కాలం గడిచిన తర్వాత మరో పెద్ద పాము ఈ ఆలయానికి నిత్యం వచ్చేదని అక్కడ ఉన్న కోనేరులో స్నానమాచరించి ఆలయంలో భక్తులచే పూజలు అందుకునేదని ఆలయ అర్చకులు చెప్పారు. అయితే ఈ ఆలయాన్ని ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించి ఈ ఆలయ విశిష్టతను అనేక సందర్భాల్లో చాటి చెప్పారు. అప్పటినుండి భక్తజనం తాకిడి ఈ ఆలయానికి విపరీతంగా పెరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టికి, మాస శివరాత్రికి షష్టి మంగళవారం కలిసి వచ్చిన రోజుల్లో ఈ ఆలయానికి విపరీతమైన భక్తజనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో నిద్రించేందుకు టోకెన్లు తీసుకొని మరి మహిళలు వేచి ఉంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.