
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఘనంగా రథోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన ఇవాళ (మంగళవారం) రాత్రి 7:00 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. రాత్రితో స్వామి వారి వాహన సేవలు ముగుస్తాయి. బుధవారం జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. స్వర్ణ రథం 32 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఉంది. 74 కిలోల మేలిమి బంగారంతో 18 ఇంచుల మందంతో కూడిన రాగి పై 9 సార్లు తాపడం చేశారు. వెండి రథం కొయ్యకు సరికొత్త హంగులతోనే ఈ స్వర్ణ రథాన్ని తయారు చేశారు. రథం తయారికీ టీటీడీ రూ.30 కోట్లు ఖర్చు చేసింది. కాగా.. సోమవారం రాత్రి గజరాజుపై వేంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు. శ్రీరామచంద్రుని రూపంలో మలయప్పస్వామి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 81,318 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,464 మంది తలనీలాలు సమర్పించారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అనంతరం స్వామి వారిని సామాన్య భక్తులు ఈ సంఖ్యలో దర్శించుకోవడం ఇదే ప్రథమం. సోమవారం మధ్యాహ్నం శ్రీ మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు మొదటిసారిగా పిస్తాబాదం, కుంకుమపువ్వుతో మాలలు, కిరీటాలు ధరింపజేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన గరుడసేవకు ఏపీఎస్‌ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. సుమారు రూ.2 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుమల డిపో 740 ట్రిప్పులు, అలిపిరి 513, తిరుపతి 287, పుత్తూరు 255, మంగళం 221, శ్రీకాళహస్తి 148, కుప్పం 44, 36, పుంగనూరు 22, చిత్తూరు 15 ట్రిప్పులతో మొత్తం 2345 ట్రిప్పులతో 1,01,880 మంది భక్తులను తిరుమలకు చేరవేసింది. రికార్డు స్థాయిలో బస్సులను నడిపి భారీగా ఆదాయం తీసుకువచ్చింది.
మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి