దక్షిణ కాశీగా,ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం స్వామి వారి చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం నుండి స్వామివారు నంది వాహనంపై దక్షిణముఖంగా బయలుదేరి ఉత్తరముఖంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నదిలో మిరియాబిల్లి రేవు వద్ద స్వామివారు చేరుకున్నారు. అర్చకులు భక్త జన సందోహం మధ్య స్వామి వారికి శాస్త్రోక్తంగా చక్రతీర్ధ స్నానం నిర్వహించారు అర్చక స్వాములు.
మిరియాబిల్లి రేవులో స్వామివారికి చక్ర స్నానం ఆచరించగా దిగువున అదే నదీ తీరంలో తండోప తండోలుగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు మంగళ స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పవిత్రమైన వంశధార… జనధారలా సాగిపోయింది. శివ నామ స్మరణతో మారు మ్రోగింది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగున రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుండి, పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీముఖ లింగేశ్వరుడి చక్ర తీర్థ స్నానంతో పవిత్ర వంశధార నది ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. స్వామి వారు చక్ర తీర్థం రోజున ఆ పవిత్ర జలాలలో తాము స్నానం చేస్తే..అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, పుణ్య ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..