దశావతారాల్లో శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం శ్రీరాముడు. త్రేతాయుగంలో దశరథ, కౌసల్య దంపతులకు వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించాడు. మానవుడిగా పుట్టి.. తన నడవడికతో దేవుడిగా పూజింపబడుతున్నాడు శ్రీరాముడు. ప్రతి సంవత్సరం చిత్ర శుద్ధ నవమి రోజున శ్రీ రామనవమిగా పండగలా జరుపుకుంటారు హిందువులు. శ్రీరామ నవమి విశిష్టత పూజ విధానం గురించి తెలుసుకుందాం..
“శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం.. రామనామ వరాననే”.. అంటూ రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుడు చెప్పాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ రామ నవమి పూజ ఎప్పుడు చేయాలంటే:
సీతారాముల కళ్యాణం లేదా శ్రీరాముడికి పూజ మధ్యాహ్నం 12 గంటలకు చేయాలి. పూజ చేసే సమయంలో ఐదు వత్తులు వేసే విధంగా దీపారాధన ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి.. తులసి మాలతో రాముడి విగ్రహాన్ని అలంకరించండి. అంతేకాదు పూజ చేసేవారు తులసి మాలను ధరించండి. పూజ పూర్తయిన తర్వాత నిరుపేదలకు అన్నదానం చేయండి. శ్రీ రామరక్షా స్తోత్రం పఠించండి. శ్రీరాముడికి సంబంధించిన పుస్తకాలను పంచి పెట్టండి. తాంబూలం ముత్తైదువులకు ఇవ్వండి.
శ్రీ రామ నవమి పూజ నియమాలు:
శ్రీ రామ నవమి రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారములచే ఆరాధించాలి. శ్రీ రామ దేవాలయం దర్శించుకోవడం మేలు చేకూరుతుంది. సీతారాములకు పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే.. అనుకున్న పనులు జరుగుతాయి. సకల సంపదలు లభిస్తాయని విశ్వాసం. శ్రీరామనవమి రోజున రామదేవుని కథ వ్రతం ఆచరించడం అత్యంత ఫలవంతం.
శ్రీరామ నవమి మర్నాడు శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించాలి. బియ్యం పాయసం చేసి బంధువులకు నిరుపేదలకు పెట్టండి. శక్తి కొలది నిరుపేదలకు దానం చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..