Prasanna Venkateswara Brahmotsavams: తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహించారు.
వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి తెలియజేస్తున్నారు.
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 4 నుండి శ్రీవారి కల్యాణోత్సవం ప్రారంభమైంది. ఈ కళ్యాణం ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వభూపాలవాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణరెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: మందారం టీ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో.. తయారీ విధానం ఎలా అంటే