Tiruchanur: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ జరిగింది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆలయంలో శ్రీయాగానికి గురువారం రాత్రి వేడుకగా శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుండి ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అర్చకులు వేంపల్లి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా ఈ యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆచార్య రుత్విక్ వరణం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం 50ఏళ్ల తర్వాత శ్రీయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాంచ రాత్ర ఆగమం ప్రకారం ప్రతిరోజు యాగ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు మహాపూర్ణాహుతి తో యాగం ముగుస్తుందని సుబ్బారెడ్డి వివరించారు. భక్తులు ఈ యాగాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కల్పించాలని భావించినా, కోవిడ్ వల్ల ఏకాంతంగా నిర్వహించాల్సి వస్తోందన్నారు. ఈ యాగం వల్ల దేశ ప్రజలకు ధనం, ధాన్యం, గో సంతతి అభివృద్ధి చెందుతాయన్నారు.
జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, అర్చకుడు బాబుస్వామి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీవరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసింది. 21,27వ తేదీల్లో బ్రేక్ దర్శనాలు సైతం రద్దయ్యాయి.
నేటినుంచి కార్యక్రమాలిలా..
జనవరి 21న మొదటిరోజు (శుక్రవారం) ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాగశాలలో హోమాలు, చతుష్టానార్చన, అగ్నిప్రతిష్ఠ, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహామంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి తీసుకొస్తారు.
జనవరి 22నుంచి 26వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 27న చివరిరోజు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు.
ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు అభిషేకం మరియు అవభృతం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీయాగం కారణంగా జనవరి 20 నుండి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేయడమైనది.
ఇవి కూడా చదవండి: Budget 2022: బడ్జెట్‌పై బండెడు ఆశలతో సామాన్య ప్రజలు.. బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారంటే..!
Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతంలో రూ.5 కే కడుపునిండా భోజనం.. క్వాలిటీ కూడా నెక్ట్స్ లెవల్