Samatha Kumbh 2025: గ్రహదోషాలు తొలగించే డోలోత్సవం.. 18 దివ్యదేశ మూర్తులకు గరుడ సేవలు..

అదో చూడముచ్చటైన దృశ్యం. పాలు, తేనె, ఫలరసాలు, శుద్ధజలాలతో అభిషేకించారు. అంతకుముందు నిత్య కైంకర్యాలు యధావిధిగా సాగాయి. శ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం కొనసాగింది. ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై నిర్వహించారు. తదుపరి భక్తులకు చినజీయర్‌ స్వామి స్వయంగా తీర్థం అనుగ్రహించాక, పూర్ణాహుతి, బలిహరణ జరిగింది.

Samatha Kumbh 2025: గ్రహదోషాలు తొలగించే డోలోత్సవం.. 18 దివ్యదేశ మూర్తులకు గరుడ సేవలు..
Samatha Kumbh Dolu Utsavam

Updated on: Feb 17, 2025 | 8:13 PM

సమతాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా డోలోత్సవం కన్నులపండువగా సాగింది. డోలోత్సవాన్ని దర్శిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. పారాయణం, సంకీర్తనం తర్వాత ఉపచారం ఇచ్చి నాలుగు వేద పారాయణాలు చేసి స్వామిని నిద్రపుచ్చారు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌ని నమ్మకం. అందుకే గరుడసేవను చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో డోలోత్సవం వైభవంగా సాగింది. డోలోత్సవాన్ని దర్శిస్తే గృహ దోషాలు తొలగిపోతాయంటారు. చతుర్వేద పారాయణం, సంకీర్తనం పాడాక.. అర్చక స్వాములు, జీయరు స్వాములు పెరుమాళ్లకు ఊయలలు ఊపారు.

గరుడ సేవలు స్వీకరించిన 18 రూపాలలో ఉన్న భగవంతునికి అభిషేకాన్ని జరిపి ఉత్సవ శ్రమను తొలగించేందుకు డోలోత్సవాన్ని జరిపారు. పెరుమాళ్లకి మన హృదయ మందిరమే ఊయలగా ప్రేమతో జోలపాడే ఉత్సవమే ఈ డోలోత్సవం. డోలోత్సవ గీతాలను ఆలపిస్తూ నెమ్మదిగా పెరుమాళ్లకి అలుపు తీరేలా ఊయలలన్నింటినీ ఊపుతూ జోలపాడారు. ప్రతీ ఆలయంలో రాత్రి సమయంలో ఏకాంత సేవగా పెరుమాళ్లకి సమర్పిస్తారు. సమతామూర్తి రాకతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి దివ్య సంకల్పంతో ఒకేసారి 18 రూపాలలో ఉన్న పరమాత్మని ఊయలలూపే అద్భుత అవకాశం భక్తులకు అనుగ్రహించారు. మది నిండా భక్తితో డోలోత్సవాన్ని దర్శిస్తే సంశయాలు తొలిగి సకల శుభాలు కలుగుతాయి.

ఒకనాడు తనని పరీక్షించ వచ్చిన త్రిమూర్తులు ముగ్గురిని పసివాళ్లుగా చేసి ఊయలూపిన ఘనత అనసూయదేవికి దక్కింది. మరోసారి సాక్షాత్తు భగవంతుణ్ణి సంతానంగా పొందిన దశరథుడు తన ముగ్గురు రాణులతో కలిసి నలుగురు బిడ్డలని ఒకే మారు ఊయల ఊపి ఆనంద తరంగితుడై ఉంటాడు. భక్తులందరి చేత ఈ సేవను పెరుమాళ్లకి అందేలా చేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి. ఒక పెరుమాళ్లని ఒక ఊయలలో దర్శించే అవకాశమే మనకు లభిస్తుంది. సమతాకుంభ్‌ ఉత్సవాల్లో మాత్రం అలా కాదు. సమతామూర్తి రాకతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి దివ్య సంకల్పముతో ఒకేసారి 18 రూపాలలో ఉన్న పరమాత్మని ఊయలూపే అద్భుత అవకాశాన్ని అనుగ్రహించారు.

ఇవి కూడా చదవండి

విశేషోత్సవాల్లో భాగంగా సమతాకుంభ్‌ వేడుకల్లో అలుపు తీరేలా జరిపిన ఈ డోలోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉపచారాలు, చతర్వేద పారాయణతో స్వామిని నిద్రపుచ్చడమే ఈ డోలోత్సవం వెనుకున్న పరమార్ధం. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలకు ఓ ప్రత్యేకత ఉంది. గజ, తురగ, శేషాది వాహనాలలో రోజుకొకటి అధిరోహించి భగవంతుడు దర్శనమిస్తాడు. దానిలో ఆంతర్యం జీవరాసులన్నిటికీ తానే ఆధారమని తెలియజేయడం. ఈ వాహన సేవలన్నింటిలో గరుడ వాహన సేవను ప్రత్యేకంగా చెబుతారు. గరుడపై వేంచేసిన విష్ణువును దర్శిస్తే ఎంతో ఆనందాన్ని పొందుతారని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.108 పెరుమాళ్ల గరుడులపై ఒక్కసారే సేవించే శక్తి మన కనులకు లేదని, ఆరు రోజుల ఉత్సవంగా దీనిని విభాగం చేశారు. రోజుకి 18 మంది పెరుమాళ్ల చొప్పున 6 రోజులలో 108 మంది పెరుమాళ్ళకి ఈ గరుడవాహన సేవలు జరిపిస్తారు.

8వ రోజు తిరునీర్‌మలై నుంచి పరమపదం దివ్యమూర్తి వరకు గరుడ ఉత్సవాలు సాగాయి. ఇందులో తిరుమల శ్రీవారు, అహోబిలం నరసింహస్వామి కూడా ఉన్నారు. సామాన్యంగా మనిషి తలతో, గ్రద్ద ముక్కుతో 108 రెక్కలు కలిగి ఉన్న గరుడ వాహనాన్ని అన్నిఆలయాలలో దర్శిస్తాము. కానీ సమతా ప్రాంగణంలోని దివ్యదేశాధీశులకు ఎంతో ప్రత్యేకంగా పక్షిరాజు రూపంలో రెక్కలుచాచి ఉన్న గరుడవాహనాలను అద్భుతంగా రూపకల్పన చేశారు. గరుడ వాహనారూఢుడైన ఒక్క స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యప్రదం అంటారు. మరి 18 గరుడవాహనాలపై 18 దివ్యదేశాల్లో ఉండే స్వామిని సేవించుకోగలగడం కేవలం శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి దివ్యసంకల్పం వల్లనే సాధ్యపడింది.

అంతకుముందు పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి. అదో చూడముచ్చటైన దృశ్యం. పాలు, తేనె, ఫలరసాలు, శుద్ధజలాలతో అభిషేకించారు. అంతకుముందు నిత్య కైంకర్యాలు యధావిధిగా సాగాయి. శ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం కొనసాగింది. ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై నిర్వహించారు. తదుపరి భక్తులకు చినజీయర్‌ స్వామి స్వయంగా తీర్థం అనుగ్రహించాక, పూర్ణాహుతి, బలిహరణ జరిగింది.