Sabarimala: కేరళలోని శబరిమల ఆలయం సోమవారం తెరుచుకుంది. ఈ సీజన్‌లో అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకొని దర్శనానికి వెళుతారు. మంగళవారం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. కరోనా కారణంగా గతంలో అనేకసార్లు మూతబడిన దేవాలయం.. దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తెరుచుకుంది. ప్రధాన అర్చకుడు (తంత్ర) కందరు మహేశ్ మోహన్‌రావు సమక్షంలో పదవీ విరమణ చేసిన అర్చకుడు వీకే జయరాజ్ పొట్టి ఆలయ గర్భగుడిని ప్రారంభించారు.
మరోవైపు భారీ వర్షాల కారణంగా వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు కొండపైకి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంపా నది నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున ఆ నదిలో పుణ్యస్నానాన్ని అనుమతించమని అధికారులు చెప్పారు. వర్చువల్ క్యూ సిస్టమ్‌లో బుక్ చేసుకున్న వారి తేదీని మార్చినప్పటికీ, స్పాట్ బుకింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు కురస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లోని కొన్ని రహదారులు దెబ్బతిన్నాయి.
వరదల నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్‌ను మళ్లించారు. COVID-19 మహమ్మారి వల్ల ఈ సీజన్‌లో వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా రోజుకు 30,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. కొవిడ్-19 దృష్ట్యా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం సమర్పించినవారికే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. క్యూలైన్లో భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం విధిగా పాటించాలని ఆదేశించింది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున.. శబరిమల కొండపై రాత్రిళ్లు ప్రయాణించొద్దని ఆదేశించింది.