AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: ఒకే రామకథ.. ఎన్నో రామాయణాలు! వాటి ప్రత్యేకతలు తెలుసా?

Types of Ramayana: రామాయణం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది వాల్మీకి రామాయణమే. కానీ భారతదేశంలో వివిధ భాషలు, సంస్కృతుల్లో ఎన్నో రామాయణాలు రచించబడ్డాయి. రామచరితమానస్, ఆధ్యాత్మ రామాయణం నుంచి రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం వరకు ప్రముఖ రామాయణాల ప్రత్యేకతలు తెలుసుకుందాం.

Ramayana: ఒకే రామకథ.. ఎన్నో రామాయణాలు! వాటి ప్రత్యేకతలు తెలుసా?
Types Of Ramayana
Rajashekher G
|

Updated on: Nov 05, 2026 | 1:50 PM

Share

Types of Ramayana: హిందూ ధర్మంలో రామాయణానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. రామాయణం అంటే కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదు.. ధర్మం, భక్తి, త్యాగం, ప్రేమ, ఆదర్శ జీవనం వంటి ఎన్నో విలువలను మనకు బోధించే పవిత్ర గ్రంథం. శ్రీరాముడి జీవిత చరిత్రను, ఆయన పాటించిన ధర్మాన్ని, సీతమ్మ తల్లి పాతివ్రత్యాన్ని, హనుమంతుడి భక్తిని ఈ ఇతిహాసం మనకు పరిచయం చేస్తుంది. మహర్షి వాల్మీకి రచించిన సంస్కృత రామాయణం అత్యంత ప్రాచీనమైన రామకథా గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. అయితే కాలక్రమేణా వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, మహర్షులు, భక్తులు తమ భాష, సంస్కృతి, ఆధ్యాత్మిక భావనలకు అనుగుణంగా రామకథను రచించారు. అందుకే భారతదేశంలో సంస్కృతంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, అవధీ వంటి అనేక భాషల్లో రామాయణాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళి పర్వదినం సందర్భంగా భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ రామాయణాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

  1. వాల్మీకి రామాయణం – సంస్కృతం: మహర్షి వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆదికావ్యంగా పిలుస్తారు. వాల్మీకి మహర్షిని ఆదికవిగా గౌరవిస్తారు. ఈ గ్రంథంలో శ్రీరాముడి జననం, విద్యాభ్యాసం, సీతమ్మతో వివాహం, వనవాసం, సీతాపహరణం, రావణ సంహారం, అయోధ్యకు తిరిగి రావడం వంటి ప్రధాన ఘట్టాలు వివరించబడ్డాయి. ఇందులో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అనే ఏడు కాండలు ఉన్నాయి.
  2. రామచరితమానస్ – అవధీ: ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రామకథా గ్రంథాల్లో రామచరితమానస్ ఒకటి. దీనిని 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ అవధీ భాషలో రచించారు. ఇందులో శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడిగా, విష్ణుమూర్తి అవతారంగా వర్ణించారు. భక్తి, ప్రేమ, సమర్పణ, ధర్మబద్ధమైన జీవనం వంటి సందేశాలు ఈ గ్రంథంలో ప్రధానంగా కనిపిస్తాయి.
  3. ఆధ్యాత్మ రామాయణం – సంస్కృతం: ఆధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణంలో భాగంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో శ్రీరాముడిని కేవలం రాజుగా కాకుండా పరబ్రహ్మ స్వరూపంగా వివరించారు. రాముడు, సీతమ్మ తల్లి పాత్రల ద్వారా ఆత్మజ్ఞానం, భక్తి, మోక్షం, ఆధ్యాత్మిక తత్వాలను తెలియజేశారు.
  4. అద్భుత రామాయణం – సంస్కృతం: ఈ రామాయణంలో సీతమ్మ తల్లి శక్తి స్వరూపానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా కనిపించే సీతమ్మ పాత్రకు భిన్నంగా, అపారమైన శక్తి కలిగిన దేవీ స్వరూపంగా ఆమెను ఇందులో చిత్రించారు. అందుకే ఈ గ్రంథం రామకథలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఆనంద రామాయణం – సంస్కృతం: ఆనంద రామాయణంలో శ్రీరాముడి జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన ఘట్టాలు ఉన్నాయి. సాధారణంగా తెలిసిన రామకథతో పాటు పూజలు, వ్రతాలు, ఆచారాలు, ధార్మిక సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను కూడా ఇందులో వివరించారు.
  7. తొర్వే రామాయణం – కన్నడ: కన్నడ సాహిత్యంలో తొర్వే రామాయణానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని కుమార వాల్మీకి రచించారు. శ్రీరాముడి కథను కన్నడ భాషలో, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ గ్రంథంలో వివరించారు.
  8. రంగనాథ రామాయణం – తెలుగు: తెలుగు సాహిత్యంలో రంగనాథ రామాయణం ఎంతో ప్రసిద్ధి చెందింది. 13వ శతాబ్దంలో గోన బుద్ధారెడ్డి దీనిని రచించారు. తెలుగు ప్రజల భాషా, సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా శ్రీరాముడి కథను ఇందులో అందించారు. అలాగే కవయిత్రి మొల్ల రచించిన మొల్ల రామాయణం కూడా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకుంది. సరళమైన తెలుగులో రామకథను అందించడం ఈ రచన ప్రత్యేకత.

రామాయణం.. తరతరాలకు ధర్మబోధ

భాషలు మారినా, రచనా శైలి మారినా రామాయణంలోని ప్రధాన సందేశం మాత్రం ఒక్కటే. ధర్మం, సత్యం, త్యాగం, భక్తి, ఆదర్శ జీవనం మనిషి జీవితానికి మార్గదర్శకాలని ఈ రామకథలు తెలియజేస్తాయి. అందుకే వేల సంవత్సరాలుగా రామాయణం భారతీయ సంస్కృతిలో భాగమై, తరతరాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న రామాయణ గ్రంథాల వివరాలు చారిత్రక, సాహిత్య, ఆధ్యాత్మిక సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వివిధ ప్రాంతాలు, సంప్రదాయాలను బట్టి రామకథలోని కొన్ని అంశాలు, వివరణల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us