భారత్ లో సోమవారం నెలవంక కనిపించింది. దీంతో ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల మొదలైంది. చంద్రుడు కనిపించగానే ముస్లిం సమాజం అల్లాను ఆరాధించే మాసం మొదలైంది. రంజాన్ మాసం ముస్లిం మతంలో పవిత్ర మాసం. ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల. ఈ మాసంలో ముస్లింలు నెలంతా ఉపవాసం దీక్ష చేపట్టి అల్లాను ఆరాధిస్తారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాన్ని ప్రతి ముస్లింలు తప్పనిసరిగా చేస్తారు. ఇస్లాం మతం ప్రకారం రంజాన్ పవిత్ర రోజుల్లో చేసే ప్రార్ధనలతో అల్లా సంతోషంగా ఉంటాడని విశ్వాసం. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందే ఆహారాన్ని (సహర్) తింటారు. అదే సమయంలో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మగ్రిబ్‌లో సూర్యుడు అస్తమించినప్పుడు ఇఫ్తార్ తింటారు. ఈ సమయంలో కనీసం లాలా జలం కూడా మింగరు.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సహర్, ఇఫ్తార్ సమయాల గురించి కూడా ముస్లిం మత పెద్దలు సమాచారం ఇచ్చారు.
ఇస్లాం మతంలో రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెల మొత్తం ముస్లిం ప్రజలు రోజాను ఆచరిస్తారు. అంటే ఉపవాసం ఉంటారు. ఎక్కువ సమయం అల్లాను ఆరాధించడంలో గడుపుతారు. అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్‌ను ఈ నెల చివరిలో జరుపుకుంటారు. దీనిని ఈద్ అని కూడా పిలుస్తారు.
ఇస్లాం మతం విశ్వాసం ప్రకారం రంజాన్ రోజుల్లో దేవుడిని ఆరాధించడం పుణ్యాన్ని ఇస్తుంది. రంజాన్‌లో చంద్రుని దర్శనం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే చంద్రుని దర్శనం తర్వాత మాత్రమే మొదటి ఉపవాసం మొదలు పెడతారు. ఇస్లాం మతం ప్రకారం ఈ నెలలో ప్రవక్త మహమ్మద్ ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ షరీఫ్‌ను అందుకున్నారు. అందువల్ల ఈ పవిత్ర దినాలలో, ప్రజలు నెల మొత్తం ఉపవాసం ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..