అయోధ్యలో ఈరోజు ( జనవరి 22వ తేదీ సోమవారం) రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ రోజున ఆచార నియమాలతో శ్రీ రాముని బాల రూపాన్ని ఆలయంలో ప్రతిష్టించనున్నారు. బాల రాముడికి నిత్య పూజలను ప్రత్యేక రామనంది సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నారని తెలుస్తోంది. రామమందిరం రామనంది సంప్రదాయానికి చెందినదని.. అందుకే అయోధ్య రామాలయంలో కూడా అదే పద్ధతిలో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. అయోధ్యలోని దాదాపు 90 శాతం దేవాలయాలలో ఈ సంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి. ఈ సంప్రదాయం ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రోజూ బాల రామయ్య పూజలను అందుకోనున్నాడు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం రామ్ లల్లా ఆరాధన చేయనున్న రామనంది సంప్రదాయం మిగత సంప్రదాయాలకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. రాముని బాల రూపాన్ని ఇక్కడ పూజిస్తారు. ఈ సమయంలో బాల రామ చంద్రుడి పెంపకం, ఆహారం అందించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం బాల రాముడిని మంచం మీద నుండి లేపిన తర్వాత.. ఎర్రచందనం, తేనె మిశ్రమంతో స్నానం చేయిస్తారు. మధ్యాహ్నం విశ్రాంతి.. సాయంత్రం నైవేద్యం.. అనంతరం ఆరతి ఇస్తారు. తర్వాత బాల రామయ్య పవళింపు సేవ ఉండనుంది. ఇలా తెల్లవారుజామున మేల్కొలుపు సేవ నుంచి పవవలింపు సేవ వరకు 16 మంత్రాల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇదే పూజా విధానం బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట తర్వాత కూడా రోజూ కొనసాగుతుంది.
బాల రామయ్యకు ప్రతి రోజు సమయం ప్రకారం వివిధ రకాల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అంటే రోజులో నాలుగు సార్లు రామ్ లల్లాకు ఆహారం అందించబడుతుంది. ఈ నైవేద్యాన్ని రామ మందిరంలోని వంటగదిలో తయారుచేస్తారు. ఉదయం బాల భోగ్‌తో ప్రారంభమవుతుంది.. ఈ సమయంలో రబ్రీ, పాల కోవా లేదా మరేదైనా స్వీట్ బాల రామయ్యకు అందించనున్నారు.
రాంలాలాకు మధ్యాహ్నం రాజ్‌భోగ్ అందించబడుతుంది. ఇందులో పప్పు, అన్నం, రోటీ, కూరగాయలు, సలాడ్, ఖీర్ ఉంటాయి. సాయంత్రం హారతి సమయంలో వివిధ మిఠాయిలను సమర్పిస్తారు. రాత్రి వేళ వివిధ రకాల ఆహార పదార్ధాలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం బాల రాముడిని నిద్రపుచ్చుతారు. బాల రామయ్యకు సమర్పించిన తరువాత ఈ ప్రసాదం భక్తులకు అప్పటికప్పుడు పంపిణీ చేయబడుతుంది. అంతే కాదు ట్రస్టు ద్వారా భక్తులకు ప్రసాదంగా రోజూ యాలకులను అందజేస్తారు.
బాల రామయ్యకు ప్రతి రోజూ హారతిని ఇస్తారు. రోజులో 3 సార్లు హారతిని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, సాయంత్రం ఆరతి 7:30 గంటలకు రెండో సారి రోజులో చివరగా 8.30 గంటలకు బాల రామయ్యకు హారతిని ఇస్తారు. అనంతరం పవళింపు సేవను జరపనున్నారు. రాంలాలా దర్శనం రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే ఉండనుంది.
మరిన్ని అయోధ్య రామాలయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..