హిందూ మతంలో బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, జగన్నాథపురి నాలుగు పవిత్ర స్థలాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ నాలుగు ప్రదేశాల్లో జగన్నాథ ఆలయం ఒడిశాలోని పూరి క్షేత్రంలో ఉంది ఇక్కడ జగన్నాథుని ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథుని రథయాత్ర కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఇక్కడికి వస్తుంటారు. పురాణ గ్రంధాలలో జగన్నాథ ఆలయాన్ని ఇల వైకుంఠంగా పేర్కొన్నారు. ఈ ఆలయంలో విష్ణువు స్వయంగా కొలువై ఉంటాడని ఒక నమ్మకం.
ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని.. వారికి మోక్షం కలుగుతుందని విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు, రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అలాంటి అనేక రహస్యాలలో ఒకటి ‘మూడవ మెట్టు’ రహస్యం. ఈ మెట్టు ఆలయ ప్రధాన ద్వారం ముందు ఉంటుంది. జగన్నాథుడి దర్శనానికి వెళ్ళి వచ్చే భక్తులు ఈ మెట్టు మీద అడుగు పెట్టకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే జగన్నాథ ఆలయంలో మూడో మెట్టు ఎక్కడం నిషిద్ధమని నమ్ముతారు.
జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించడానికి 22 మెట్లు ఉన్నాయి. ఈ 22 మెట్లలో మూడవ మెట్టును యమశిల అంటారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో ఎవరైతే ఈ మూడవ మెట్టు మీద అడుగు పెట్టి వెళ్తారో.. అటువంటి వ్యక్తి యమలోక హింసను అనుభవించవలసి ఉంటుందని నమ్ముతారు. ఆలయంలో జగన్నాథుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా పొరపాటున కూడా మూడో మెట్లపై అడుగు పెట్టకూడదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆ భక్తుడు అప్పటి వరకూ సంపాదించిన పుణ్యం నశిస్తుందని నమ్మకం. ఈ మెట్టు నేరుగా యమ లోకానికి దారి తీస్తుందని .. ఈ మెట్టు మీద అడుగు పెట్టిన వారు వెంటనే యమ లోకానికి చేరుకుంటారని ఈ దేవాలయంలో అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకం. భక్తులు పొరపాటున కూడా ఈ మెట్లపైకి అడుగు పెట్టకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది ప్రత్యెక చర్యలు తీసుకున్నారు. ఈ యమ శిల మెట్టు అన్ని మెట్ల రంగుల వలె కాకుండా.. నలుపు రంగులో ఉంటుంది.
జగన్నాథుని ఆలయంలో మూడవ మెట్టుపైకి అడుగు పెట్టకూడదని ఈ నమ్మకం వెనుక ఒక పురాణ కథ ఉంది. దీని ప్రకారం ఒకసారి యమ ధర్మ రాజు జగన్నాథుడిని కలవడానికి వచ్చి.. ఓ ప్రభూ.. నీ ఆలయానికి వచ్చి నిన్ను దర్శించుకున్న భక్తుల సకల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది. దీంతో ఏ జీవి యమలోకంలోకి రావడం లేదు. ఇప్పుడు యమలోకం ఉనికి ప్రమాదంలో పడింది. కనుక దీనికి పరిష్కారం చూపించమని వేడుకున్నాడు. యమ ధర్మ రాజు విన్నపం విన్న జగన్నాథుడు.. యముడితో ఓ యమ ధర్మ రాజా చింతించకు.. ఇక నుంచి నువ్వు జగన్నాథ దేవాలయం నుంచి గర్భాలయానికి వచ్చే మెట్ల మార్గంలో మూడవ మెట్టు మీద ఆశీనుడివి అవ్వు. జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి నన్ను దర్శించుకున్న తర్వాత తిరిగి వెళ్తూ ఎవరైతే ఈ మూడో మెట్టుమీద అడుగు వేస్తారో.. అతనికి నా దర్శనం వలన కలిగిన పుణ్యం నశించి యమలోకానికి చేరుకుంటాడు అనే వరం ఇచ్చాడు.
మరొక పురాణ కథ నమ్మకం ప్రకారం ఈ ఆలయంలోని మూడవ మెట్టు జగన్నాథుని సోదరి అయిన సుభద్రా దేవి నివాసాన్ని సూచనట. దేవత నివాసాన్ని కాలితో తాకడం అగౌరవంగా పరిగణించబడుతుంది. కనుక భక్తులు పొరపాటున కూడా ఈ మూడో మెట్టు మీద అడుగు పెట్టరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు