Kumbh Mela 2021: కుంభమేళా-2021 కోసం హరిద్వార్‌లో సర్వం సిద్ధం చేశారు. కరోనా మార్గదర్శకాలతో కుంభమేళా జరుగుతుందని ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఇప్పటికే తెలిపింది. గురువారం శివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గంగానదిలో మొదటి షాహి స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, సాధువులు తరలిరానున్నారు. ఇప్పటికే వేలాది మంది సాధువులు హరిద్వార్ చేరుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్, పౌరి గర్హ్వాల్, డెహ్రాడూన్ జిల్లాల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కుంభమేళా అధికారి దీపక్ రావత్ మంగళవారం వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. దీంతోపాటు పలుచోట్ల శానిటైజర్స్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కుంభమేళా సందర్భంగా భద్రత కోసం ఘాట్ల వెంట, రహదారులపై భద్రతా సిబ్బందిని మోహరించామని.. పరిశుభ్రత కోసం స్వచ్ఛంద కార్యకర్తలను నియమించామని తెలిపారు.
కాగా.. కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముందుగా వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోనే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుంభమేళాలో పాల్గొనేవారంతా అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. దీంతోపాటు 72 గంటల ముందు తీసుకున్న కరోనావైరస్ నెగెటివ్ రిపోర్ట్ సహా ఐడెంటిటీ పత్రాలను అప్‌లోడ్ చేయాలన్నారు. ఆ తర్వాతే ఈ-పాస్‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కుంభమేళాలో పాల్గొనే యాత్రికులంతా ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారంతా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన మేరకు మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని.. ఒకవేళ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కుంభమేళా ప్రతి పన్నేండు ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ మహాకుంభ్ జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది. గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్‌లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని, వ్యాధులు, పాపల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల అపార విశ్వాసం. ఈ కుంభంలో ప్రధానంగా 4 షాహిస్నాన్ ఘాట్‌లు, 6 ప్రధాన స్నాన్ ఘాట్‌లుంటాయి. దానిలో భాగంగా భక్తులు గంగా నదిలో రేపు మొదటిగా పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకోనున్నారు.
Also Read: