హిందూ మతంలో పంచామృతం చాలా పవిత్రమైనది. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పంచామృతం లేని పూజ, వ్రతం, అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పంచామృతం అంటే ఐదు అమృతాలని అర్ధం. పంచామృతం ఐదు అమృతం వంటి పదార్ధాలను కలిపి తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి అమృతం వలె పరిగణించబడుతుంది. పంచామృతం దేవుళ్ళకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు. పంచామృతాన్ని కొన్ని చోట్ల చరణామృతం అని కూడా అంటారు. పంచామృతం ఏయే అమృతం వంటి పదార్ధాలతో తయారు చేస్తారో తెలుసుకుందాం.
ఆవు పాలు పోషణ, స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడతాయి. పంచామృతంలో పాలు ప్రధాన పదార్ధం. కనుకనే పంచామృతంలో అన్ని వస్తువుల కంటే పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పాలు మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.
పంచామృతంలో ఆవు పాలు తర్వాత, ఆవు పెరుగు చేర్చవలసిన ముఖ్యమైన పదార్ధం. పెరుగు వల్ల పంచామృతం రుచి ప్రత్యేకంగా మారుతుంది. పెరుగు స్వచ్ఛతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. పూజ సమయంలో దేవుళ్లను నైవేద్యంగా పెరుగును కూడా ఉపయోగిస్తారు. పాలతో పాటు పెరుగు కూడా శివలింగానికి నైవేద్యంగా పెడతారు. ఆరోగ్య దృక్కోణం దృష్ట్యా పంచామృతంలో పెరుగు ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది.పెరుగు శరీరంలోని వాత దోషాన్ని కూడా తగ్గిస్తుందని నమ్ముతారు.
తేనె తీపి రుచిని కలిగి ఉంటుంది. ఆరోగ్య పరంగా ప్రత్యేకస్థానాన్ని కలిగి ఉంది. ఆయుర్వేదంలో తేనె ఉత్తమ ఔషధంగా పరిగణించబడుతుంది. తేనె దేవునికి సంబంధించిన పదార్ధం అని భావించి తేనెను అనేక మతపరమైన ఆచారాలు, పూజలలో కూడా ఉపయోగిస్తారు.
ఆవు నెయ్యి స్వచ్ఛత, ఆరోగ్యకరమైన లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. హిందూ మతంలో నెయ్యి అన్ని మతపరమైన, పవిత్రమైన ఆచారాలతో పాటు.. సాధారణ రోజువారీ పూజలలో కూడా ఉపయోగిస్తారు. హవనంలో ఆవు నెయ్యిని అగ్నికి సమర్పిస్తారు. నెయ్యి దీపం వెలిగిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శివయ్యకు ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారు. దేవతల ఆశీర్వాదం కోసం పంచామృతంలో నెయ్యిని ఉపయోగిస్తారు.
పంచామృతంలో పండ్ల రసం లేదా కొబ్బరి నీరుని ఉపయోగిస్తారు. పంచామృతానికి మంచి రుచిని పోషకాలను అందిస్తాయి. పంచామృతంలో పండ్ల రసం చేర్చడం వలన జీవితం సుఖమయం కావాలని దైవాన్ని కోరుకోవడమే..
పంచామృతాల్లో తప్పని సరిగా తులసి ఆకులను జోడిస్తారు. తులసి విష్ణువు, లక్ష్మిదేవికి ప్రియమైనవిగా పరిగణిస్తారు. తులసి ఆకులో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు పూజలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పంచామృతంలో తులసి ఆకులను జోడించడం వలన పంచామృతం చాలా పవిత్రమైనదిగా మారుతుందని విశ్వాసం.
పంచామృతం ఐదు అమృతం వంటి పదార్ధాలతో తయారు చేస్తారు. కనుక పూజలో, వ్రతాల్లో కూడా ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పంచామృతంలో సాత్విక, పవిత్రమైన లక్షణాలు ఉన్నాయి.
పంచామృతంలోని ఆవు పాలు స్వచ్ఛతకు చిహ్నం. మనిషి జీవితం పాలు వలె స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉండాలని మనకు బోధిస్తుంది. పంచామృతంలో పెరుగు జోడించడం వల్ల చెడుకు దూరంగా ఉండి జీవితంలో సద్గుణాలను అలవర్చుకోవడం నేర్పుతుంది.
తేనె చాలా తీపి మరియు స్వతహాగా శక్తినిస్తుంది. పంచామృతంలో తేనెను జోడించడం ద్వారా, ప్రవర్తన, మాటలు మధురంగా ఉండాలని అలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడని నమ్మకం. నెయ్యి శరీరానికి శక్తిని అందిస్తుంది. పంచామృతంలో చేర్చబడిన నెయ్యి అన్ని పరిస్థితులలో సానుకూల శక్తిని కలిగి ఉండాలని మనకు బోధిస్తుంది. పండ్ల రసం సోమరితనాన్ని తగ్గిస్తుంది. పంచామృతంలో చేర్చబడిన పండ్ల రసం సోమరితనాన్ని విడిచిపెట్టమని నేర్పుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు