AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashi Yatra: కాశీయాత్ర పూర్తి కావాలంటే ఈ ఒక్క దర్శనం తప్పనిసరి! విశాలాక్షి దేవి రహస్యాలు

Kashi Vishalakshi Temple: వారణాసి (కాశీ) హిందువులకు అత్యంత పవిత్ర తీర్థక్షేత్రంగా భావించబడుతుంది. ఇది మోక్షదాయక స్థలమని విశ్వాసం. ఇక్కడి విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, స్వయంభూ శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్మకం. గంగా స్నానం ద్వారా పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే మణికర్ణికా ఘాట్‌ను శక్తిపీఠంగా భావించి, విశాలాక్షి దేవిని అక్కడ పూజిస్తారు.

Kashi Yatra: కాశీయాత్ర పూర్తి కావాలంటే ఈ ఒక్క దర్శనం తప్పనిసరి! విశాలాక్షి దేవి రహస్యాలు
Vishalakshi Devi Temple
Rajashekher G
|

Updated on: May 10, 2026 | 11:03 AM

Share

వారణాసి (కాశీ) హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. ఇది కేవలం ఒక తీర్థయాత్ర స్థలం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ముక్తికి ద్వారమని భక్తుల విశ్వాసం. ఇక్కడి విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. స్వయంభూగా వెలసిన పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్మకం. అలాగే గంగా నదిలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాశీ (Kashi) ఒక మహా శక్తి పీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షయాగంలో సతీదేవి ఆత్మార్పణం చేసినప్పుడు ఆమె కర్ణాభరణాలు (చెవి కుండలాలు) పడిన ప్రదేశమే మణికర్ణికా ఘాట్ అని పురాణాలు చెబుతాయి. ఇక్కడ వెలసిన విశాలాక్షి దేవి శక్తిపీఠంగా భక్తులచే ఆరాధించబడుతుంది.

కాశీలోని దివ్య మూర్తులు

కాశీ పేరు వినగానే పవిత్ర గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దేవి, అన్నపూర్ణాదేవి, డుంఠి గణపతి, కాలభైరవుడు మనసులో నిలుస్తారు. ఈ క్షేత్రం జ్యోతిర్లింగ స్థలంగా మాత్రమే కాకుండా శక్తి ఉపాసనకు ముఖ్య కేంద్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. విశాలాక్షి దేవిని కొందరు మణికర్ణికాదేవిగా, మరికొందరు విశ్వలక్ష్మిగా కూడా ఆరాధిస్తారు.

విశాలాక్షి దేవి పేరు విశేషం

ఈ దేవి గర్భాలయంలో విశాలమైన, కరుణతో నిండిన కన్నులతో భక్తులను అనుగ్రహిస్తుందని భావిస్తారు. అందుకే ఆమెకు “విశాలాక్షి” అనే పేరు వచ్చింది.

విశాలాక్షి ఆలయ విశేషాలు

విశాలాక్షి ఆలయం గంగానది తీరంలోని మీర్ ఘాట్ ప్రాంతంలో ఉంది. విశ్వేశ్వరాలయానికి సమీపంలోనే ఈ శక్తి పీఠం ఉంది. కాశీ యాత్రలో విశాలాక్షి దర్శనం ప్రత్యేకమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. గర్భగుడిలో రెండు రూపాల్లో అమ్మవారిని దర్శించవచ్చని చెబుతారు. ఒకటి పురాతన స్వయంభూ విగ్రహం కాగా, మరొకటి ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన రూపంగా భావిస్తారు. ఈ విగ్రహాలు భక్తులకు శాంతి, శక్తి, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయని విశ్వాసం. అలాగే ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ కూడా ఉందని స్థలపురాణాలు చెబుతాయి. విశాలాక్షి దేవిని పసుపు, కుంకుమ, పుష్పాలతో ఆరాధించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

స్థలపురాణం

స్కంద పురాణం ప్రకారం ఒకసారి వ్యాస మహర్షి తన శిష్యులతో కలిసి కాశీలో నివసిస్తున్నప్పుడు ఏడు రోజుల పాటు భిక్ష లభించక కఠిన పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఆకలితో కోపోద్రిక్తుడైన వ్యాసుడు కాశీని శపించబోతాడు. ఆ సమయంలో విశాలాక్షి దేవి ఒక ముత్తైదువ రూపంలో ప్రత్యక్షమై అతనికి, శిష్యులకు ఆతిథ్యం అందిస్తుంది. తరువాత పరమేశ్వరుడు వ్యాసుడిని కాశీ నుంచి తాత్కాలికంగా వెలివేస్తాడు. తన తప్పు తెలుసుకున్న వ్యాసుడు శివుని క్షమాపణ కోరగా, కొంతకాలం తరువాత మళ్లీ కాశీలో నివసించే అవకాశం లభిస్తుందని వరం పొందుతాడు. ఆ తరువాత వ్యాసుడు గంగా నది అవతల తీరంలో ఆశ్రమం నిర్మించి అక్కడి నుంచే విశ్వనాథుని పూజించాడని చెబుతారు. ఈ ప్రాంతాన్ని వ్యాసకాశీ అని పిలుస్తారు.

అన్నపూర్ణాదేవి, విశాలాక్షి సంబంధం

పురాణాల ప్రకారం అన్నపూర్ణాదేవి, విశాలాక్షి దేవి ఒకే శక్తి స్వరూపంగా భావించబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో వేర్వేరు ఆలయాలుగా ఆరాధన కొనసాగుతోంది. కాశీలో అన్నపూర్ణా దేవి ఆలయం విశ్వనాథుని ఆలయ సమీపంలోనే ఉంది.

కళ్యాణదాయక శక్తి

కాశీ విశాలాక్షిని కంచి కామాక్షి, మధుర మీనాక్షితో సమానంగా శక్తివంతమైన దేవిగా భావిస్తారు. వివాహం కాని వారు విశాలాక్షి దేవిని భక్తితో ఆరాధిస్తే త్వరలో వివాహ యోగం కలుగుతుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా భాద్రపద శుద్ధ తదియ రోజున కాజలి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే దేవీ నవరాత్రుల్లో ఈ ఆలయం ప్రత్యేక వైభవాన్ని సంతరించుకుంటుంది. కాశీ విశాలాక్షి దేవి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, జీవనంలో శుభఫలాలను అందిస్తుందని విశ్వాసం. కాశీ యాత్రలో విశాలాక్షి దర్శనం తప్పనిసరి పుణ్యకార్యంగా భావించబడుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us