కలియుగ వైకుంఠ దైవం.. తిరుమలేశుడి సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 14 నిండిపోయాయి. సర్వదర్శనానికి 19 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని 65,633 మంది భక్తులు దర్శించుకోగా 23,352 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా.. స్వామివారి హుండీకి రూ. 3.68 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మరోవైపు.. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. శనివారం వేకువజామున 2గంటల నుంచి రాత్రి వరకు శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. స్వయంభువుగా వెలసిన వాయు లింగేశ్వరస్వామి నిత్యాభిషేక మూర్తిగా భక్త జనానికి దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారు నంది వాహనం, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై అధిరోహించి పురవిహారం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లను సుమారు లక్షన్నర మంది భక్తులు దర్శించుకుని ఉంటారని అధికారులు అంచనా వేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..