బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శ్రీ శారదీయ శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా సరస్వతి అమ్మవారు ఎనిమిదవ రోజు మహా గౌరీ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెడ్డవారిని శిక్షిస్తూ మంచివారిని మహా గౌరి రక్షిస్తుందని.. మోక్షాన్ని ఇచ్చి పునర్జన్మ లేకుండా చేస్తుందని భక్తుల విశ్వాసం. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక మండపంలో నవ చండి హోమం తోపాటు పుణ్య హావచనం, దీక్ష సంకల్పం, గౌరీ నామార్చన తదితర పూజలు నిర్వహించారు. చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా వైదికులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో క్యూ లైన్ల లో ఎదురుచూస్తున్నారు.
మధుకరి దీక్షలు చేపట్టి భక్తులు ధ్యాన మందిరంలో అమ్మవారిని ధ్యానిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహిస్తున్నారు. జీవితంలోని సకల కష్టాలను తొలగించే కల్పవల్లిగా భక్తులు అమ్మవారిని కొలుస్తున్నారు. సాయంత్రం అశ్వరథంపై సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భజా భజంత్రిల మధ్య ఊరేగిస్తారు. అనంతరం జంబి వేడుకలను జరుపుకుని దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..