Mokshada Ekadashi: భగవంతుని చెంతకు భక్తుని చేర్చే అద్భుత పూజా విధానం ‘మోక్షదా ఏకాదశి’ వ్రతం.. ఇది ఎలా చేయాలంటే..
ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చేవారు.. భగవంతుని పూజలలో మునిగిపోవడం సహజం. దేవునికి చేసే పూజలలో ఎన్నోరకాలున్నాయి.
Mokshada Ekadashi: ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చేవారు.. భగవంతుని పూజలలో మునిగిపోవడం సహజం. దేవునికి చేసే పూజలలో ఎన్నోరకాలున్నాయి. చాలా మంది తమ అవసరాలు.. ఆశలు.. ఆకాంక్షలు నెరవేర్చడం కోసం దేవుని ప్రార్ధిస్తారు. కొందరు నిశ్చింతగా తమ జీవన పయనం సాగిపోవాలని కోరుకుంటూ భగవాన్ ఆరాధన చేస్తారు. మరి కొందరు తమకు మోక్షాన్ని ప్రసాదించాలని సర్వజగద్రక్షకుడిని నేరుగా వేడుకుంటారు.ఎన్నిరకాల కోర్కెలతో దైవార్చన చేసినా అది అంతిమంగా మోక్షాన్ని పొందడం కోసం చేసే కార్యక్రమమే అవుతుంది.
మానవ జన్మ పాపాల ఫలితం అనేది పురాణాలు చెప్పే మాట. మనిషిగా పుట్టడం.. పాపాలు చేయడం.. మరణించడం.. మళ్ళీ పుట్టడం కష్టాలు అనుభవిస్తూ ఉండటం ఇలా ఓ సైకిల్ లా సాగిపోతూ ఉంటుంది. అయితే, ఎవరైతే భగవంతుడ్ని మనఃస్ఫూర్తి గా పూజిస్తారో.. ఇహపరమైన కోర్కెల కోసం కాకుండా భగవంతునిలో ఐక్యం అయిపోవాలనే కోర్కెతో దైవ సన్నిధిలో గడుపుతారో వారికి మోక్షం లభిస్తుంది. కానీ, ఇలా సర్వం వదిలి మోక్షం కోసం భగవంతుని కొలిచే అవకాశం అందరికీ ఉండదు. అలా అని లెక్కకట్టలేనంత పుణ్యం మూట గట్టుకునే పనులు చేయడమూ ఎవరి వల్లా కాదు. ఇటువంటి వారి కోసం ఒక చక్కని మార్గం ఉంది. అదే ‘మోక్షదా ఏకాదశి’ వ్రతం. పేరులోనే మోక్షాన్ని నింపుకున్న ఈ పర్వదినం రోజున సరైన పద్ధతిలో చేసే విష్ణు భగవానుని అర్చన మోక్షాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు.. పండితులు చెబుతారు. మార్గశిర మాసంలో వచ్చేశుక్లపక్ష ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని అంటారు.
ఈరోజున తమ మోక్షం కోసం దేవతార్చన చేయాలనుకునే వారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ వ్రతం చేయాలంటే..
- తెల్లవారుజామునే తలస్నానం చేయాలి
- పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి
- ఇంటినీ, పూజా మందిరాన్ని శుభ్రపరిచి ఉంచాలి.
- విష్ణు మూర్తి పటాన్ని ఏర్పాటు చేసి పూలతో అలంకరించాలి.
- తరువాత విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించాలి.
- విష్ణువుకు షోడశోపచార పూజలు నిర్వహించాలి
- రోజంతా ఉపవాసం ఉండాలి.
- విష్ణు నామ జపంతో.. సంకీర్తనలతో రాత్రి మొత్తం జాగరణ చేయాలి
- ఇక మరునాడు ద్వాదశి తిథి వచ్చిన వెంటనే..స్నానాదులు ముగించి.. విష్ణుమూర్తికి పూజలు నిర్వహించాలి. తరువాత నైవేద్యం స్వామికి సమర్పించాలి. దీనితో ఏకాదశి పూజ పూర్తవుతుంది. ఈ
- మోక్షద ఏకాదశి పూజను పూర్వం వైఖాసనుడు అనే రాజు ఆచరించి మోక్షం పొందారని పురాణాల్లో పేర్కొన్నారు.
ఎదో ఒక సంవత్సరం.. ఒకరోజు ఈ వ్రతాన్ని చేస్తే మోక్షం వచ్చేస్తుందని అనుకోవద్దు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ వ్రతం ఆచరించాల్సి ఉంటుంది. ఇక ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైనది ఉపవాసం. ఏమీ తినకుండా.. తాగకుండా.. రోజంతా అంటే 24 గంటల పాటు విష్ణు నామస్మరణలో గడపడం. అంటే ఏకాదశి తిథి ప్రారంభం నుంచి ద్వాదశి తిథి ప్రారంభం వరకూ ఈ వ్రత నియమాన్ని ఆచరించాలి. ఇలా క్రమం తప్పకుండా ఎవరైతే ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరిస్తారో వారికి మోక్షం కచ్చితంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఆరోగ్య రీత్యా.. కఠిన ఉపవాసం పటించలేని వారికి పాక్షిక ఉపవాసం కూడా ఆచరించే అవకాశం ఉంటుంది. పాలు, పండ్లు.. వంటి సాత్విక ఆహారాన్ని తీసుకుని ఉపవాస విధిని నిర్వర్తించవచ్చు.
ఇవి కూడా చదవండి: Success Story: ఒక్క మహిళ.. వెయ్యిరూపాయల పెట్టుబడి.. ఏడేళ్ళు.. కోట్లాది రూపాయల సంపాదన.. ఎలా అంటారా..ఇదిగో ఇలా..!