Success Story: ఒక్క మహిళ.. వెయ్యిరూపాయల పెట్టుబడి.. ఏడేళ్ళు.. కోట్లాది రూపాయల సంపాదన.. ఎలా అంటారా..ఇదిగో ఇలా..!
మనకి ఇంట్లో అనుకోకుండా చిన్న దెబ్బ తగిలింది. రక్తం కారుతోంది. వెంటనే మన అమ్మమ్మ ఏం చేస్తుంది. వంటింట్లో ఉన్న పసుపు తీసుకొచ్చి గభాల్న దెబ్బ తగిలిన దగ్గర పెట్టి గట్టిగా వత్తి పట్టుకుంటుంది.
Success Story: మనకి ఇంట్లో అనుకోకుండా చిన్న దెబ్బ తగిలింది. రక్తం కారుతోంది. వెంటనే మన అమ్మమ్మ ఏం చేస్తుంది. వంటింట్లో ఉన్న పసుపు తీసుకొచ్చి గభాల్న దెబ్బ తగిలిన దగ్గర పెట్టి గట్టిగా వత్తి పట్టుకుంటుంది. మనకు మంట చురుక్కు మంటుంది కానీ.. రక్తం కారడం ఆగిపోతుంది. మనం ఏమనుకున్నా అమ్మమ్మకు తెలిసిన చిట్కా వైద్యం మాత్రం మారదు. అమ్మమ్మ ప్రేమతో ఆ చిట్కా వైద్యం కంటిన్యూ అవుతూనే ఉంది. ఏమిటి అమ్మమ్మ.. చిట్కా వైద్యం అని ఏదేదో చెబుతున్నారు అని అనుకుంటున్నారా? ఆగండి.. మీకు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే.. తన అమ్మమ్మ నేర్పిన చిట్కా వైద్యాలను వ్యాపారంగా మార్చుకుని లక్షాలాది రూపాయాలు సంపాదిస్తున్న ఓ వనితను పరిచయం చేద్దామని.
ఈమె పేరు ఆకాంక్ష మోడీ.. ఊరు కోల్‌కతా. ఈమె కేవలం వెయ్యిరూపాయల పెట్టుబడితో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఇంటి నుంచే మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది. ఏడేళ్ళు గడిచేసరికి ఈమె టర్నోవర్ 4 కోట్లకు చేరుకుంది. భారత్ లో తన ఇంటి నుంచి ప్రారంభించిన ఈ వ్యాపారం ఇప్పుడు సింగపూర్, యూకే, అమెరికా వంటి అనేక దేశాల్లో కస్టమర్లను తెచ్చిపెట్టింది. అమ్మమ్మ చెప్పిన వంటింటి వైద్యం నుంచి ఆకాంక్ష సాధించిన ఈ విజయం గ్లోబల్ ఇండియన్ గా ఆమెకు గుర్తింపు తెచ్చిపెడుతోంది.
డాక్టర్ ఏమీ చేయలేకపోయారు..
ఆకాంక్ష చాలా విచిత్రంగా ఈ వ్యాపారంలోకి వచ్చారు. ఒక చిన్న సంఘటన ఆమెను ఇటువైపు నడిపించింది. దాని గురించి ఆమె మాటల్లోనే..”వ్యాపారానికి సంబంధించినంతవరకు, నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు లేదా ప్లాన్ చేయలేదు. మా అత్తగారికి ఒక చర్మ సంబంధిత సమస్య ఉండేది. చాలా కాలం చర్మ సంబంధిత డాక్టర్ దగ్గర ట్రీట్ మెంట్ తీసుకున్నా పెద్దగా ఏమీ జరగలేదు. దీంతో ఆమె ఆందోళన చెందింది. ఒకసారి నేను ఆమెతో కలిసి డాక్టర్ వద్దకు వెళ్లాను. అక్కడ చాలామంది మా అత్తగారిలానే చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అప్పుడే నా మనసులో ఓ ఆలోచన మొదలైంది. అదే ఓ స్టార్టప్ అయింది. ఇప్పుడు ఈ స్థాయికి చేరింది.”
ఇంగ్లీష్ గ్రాడ్యుయేట్.. వైద్య ఉత్పత్తులు..
ఆకాంక్ష తన పాఠశాల విద్యను కోల్‌కతాలో చేసింది. ఆమె ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కాస్మెటిక్ కెమిస్ట్ చదివింది. ఆమెకు చిన్నతనం నుంచీ ఇంటి చిట్కా వైద్యం పై చాలా ఆసక్తి ఉండేది. ఇంట్లో అమ్మమ్మ దగ్గర చిన్న చిన్న వైద్య విషయాలు తెలుసుకుంటూ ఉండేది. ఆరోగ్యానికి ఉపయోగపడే వంటింటి సరంజామా గురించి ఆమె వద్ద నేర్చుకుంది. అదే ఆసక్తితో ఆయుర్వేద పుస్తకాలు బాగా చదివేది. అందులో కనిపించిన వివిధ రకాల ఉత్పత్తులను స్వయంగా తాయారు చేసుకుని తాను ఉపయోగించుకునేది. ఆమె తన చర్మ సౌందర్యం లేదా ఆరోగ్యం గురించి ఎప్పుడూ మార్కెట్ ఉత్పత్తులను ఉపయోగించలేదని చెబుతోంది. ఇక తన అత్తగారి చర్మ వ్యాధి సందర్భంగా తనకు తెలిసిన వైద్య ఉత్పత్తిని ఆమెకు తయారు చేసి ఇచ్చింది.
స్టార్టప్ ప్రయాణం ఇలా..
తన స్టార్టప్ ప్రయాణం గురించి ఆకాంక్ష మాట్లాడుతూ, ”మా అత్తగారి విషయంలో నాకు ఎక్కడా మెరుగైన ఫలితాలు రాకపోవడంతో, మా అత్తగారిని సొంతంగా ఉబ్తాన్‌ను తయారు చేసుకునేందుకు ఇచ్చాను. ఇది పూర్తిగా ఆయుర్వేదం. వివిధ మూలికలను కలపడం ద్వారా చేసింది. కొన్ని రోజుల తరువాత, ఆమె ఆ మందుతో ప్రయోజనం పొందారు. చాలా కాలంగా చికిత్స చేసినా జరగని పని ఆ ఆయుర్వేద మందు వల్లే జరిగింది. ఆ తర్వాత ఆమె తన రొటీన్ లైఫ్ లో ఈ మందును చేర్చుకుంది.
ఈ విజయవంతమైన పరిస్థితి తరువాత నేను చర్మవ్యాధి నిపుణుడి వద్దకు వెళ్లాను. వైద్యం కోసం అక్కడికి వచ్చిన వారి నుంచి వారి సమస్యలను తెలుసుకుని వారి ఇంటి చిరునామాను తెలుసుకున్నాను. దీని తరువాత వారి ఇళ్ళకు తాను తాయారు చేసిన ఆయుర్వేద మందును పంపించాను. ఇది వారికి బాగా నచ్చింది. దీంతో మందుకు డిమాండ్ పెరిగింది. ఇది చూసిన నా భర్త దీనిని వృత్తి పరమైన విధానంగా మార్చుకోమని సూచించారు. అలా నా మందును వ్యాపారంగా మార్చే ప్రక్రియ మొదలైంది.” అని వివరించింది.
వెయ్యి రూపాయలతో స్టార్టప్..
ప్రొఫెషనల్ స్థాయిలో ఈ పని చేయడానికి ముందు తాను రీసెర్చ్ చేశానని ఆకాంక్ష చెబుతోంది. వివిధ మూలికలపై అధ్యయనం ఆమె చేశారు. కాస్మెటిక్ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని సేకరించారు. దీని తర్వాత, వెయ్యి రూపాయలు ఖర్చు చేసి, మార్కెట్ నుండి ముడిసరుకును కొనుగోలు చేశారు. ముందుగా 250-250 రూపాయల ప్యాక్‌ను తయారు చేసారు. ఇంతకు ముందు ఉచితంగా ఇచ్చిన వారికి ఇచ్చారు. ఆ తర్వాత రోజురోజుకూ డిమాండ్ పెరిగింది. మేము ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా చేయవలసిన అవసరం లేదు. మౌత్ పబ్లిసిటీ ద్వారా మా పని ముందుకు సాగింది. ప్రజలు ఒకరికొకరు మా మందు గురించి చెప్పుకోవడం.. దానిద్వారా మాకు ఆర్డర్లు పెరగడం.. ఇలా మా వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది.
బడ్జెట్ విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది పడలేదని, ఎందుకంటే క్రమంగా ఈ పనిని ముందుకు తీసుకెళ్లామని ఆమె చెప్పింది. మేము అమ్మకాలు చేసిన సొమ్ము తిరిగి పనిలో పెట్టుబడి పెట్టాము. ఈ రోజు కూడా మేము అదే పని చేస్తున్నాము. మొదట్లో రోజూ రెండు కిలోల మందు మాత్రమే తయారు చేసేవాళ్లం. తర్వాత దాని పరిధిని విస్తరించాం అని ఆకాంక్ష చెబుతోంది.
8 ఉత్పత్తులతో ప్రారంభించి, నేడు 80 ఉత్పత్తులకు..
ఎనిమిది ఉత్పత్తులతో తమ పని ప్రారంభించామని ఆకాంక్ష చెప్పారు. తరువాత, ప్రజల డిమాండ్ పెరగడంతో, మేము మా ఉత్పత్తులను కూడా పెంచుకుంటూ వచ్చాము. ఈ రోజు మన దగ్గర దాదాపు 80 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇది చర్మ సంరక్షణ, సౌందర్య సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను కలిగి ఉంది. ఇవి పూర్తిగా ఆయుర్వేద ఉత్పత్తులు, అదేవిధంగా పూర్తిగా రసాయన రహితమైనవి. దీని ధర సుమారు 650 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.
మార్కెటింగ్‌కు సంబంధించి, తాము ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తమ ఉత్పత్తిని మార్కెటింగ్ చేస్తున్నామని ఆమె చెప్పింది. మా ఉత్పత్తులు Flipkart, Amazon వంటి ప్రధాన ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయిస్తున్నాము. దీనితో పాటు, మేము ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా మార్కెటింగ్ చేస్తున్నాము. ప్రస్తుతం మా బృందంలో 52 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. ఇప్పుడు కోల్‌కతాలో సొంత కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసుకున్నాం అంటూ ఆకాంక్ష తన ఉత్పత్తులు సాధించిన విజయం గురించి చెబుతోంది.
ఒక్క మహిళ.. వెయ్యిరూపాయల పెట్టుబడి.. ఏడేళ్ళు.. ఇప్పుడు ఏభై మందికి పైగా ఉపాధి పొందుతున్న సంస్థకు యజమాని.. కోట్లరూపాయల టర్నోవర్.. విదేశీ కస్టమర్లు.. ఇదండీ ఈ అమ్మమ్మ గారి మనవరాలి కథ. వ్యాపారానికి కావలసింది లక్షలాది రూపాయాల సొమ్ము కాదు.. సరైన ఆలోచన.. ప్రణాళిక.. అన్నిటినీ మించి ఓపిక అని ఆకాంక్ష విజయం మనకు చెబుతోంది.
ఇవి కూడా చదవండి: Cyber Attacks: ప్రభుత్వ సంస్థలపై ఎన్ని వేల సైబర్ దాడులు జరిగాయో తెలిస్తే ఉలిక్కి పడటం ఖాయం..